హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు బదులుగా నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లకు రివర్స్ పంపింగ్ చేపడితే ఏపీతోపాటు తెలంగాణకూ ప్రయోజనకరంగా ఉంటుందని విశ్రాంత ఇంజినీర్ల సూచిస్తున్నారు. ఇదే అంశంపై గతంలో కేసీఆర్ చేసిన ప్రతిపాదనలు అమలుచేయాలని కోరుతున్నారు. ఆ దిశగా ఇరు రాష్ర్టాలు దృష్టి సారించాలని, అంతేకాకుండా సాంకేతికంగా, ఆర్థికంగానూ ఎంతో లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విశ్రాంత ఇంజినీర్ల సూచన ప్రాధాన్యం సంతరించుకున్నది. ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను కృష్ణా మీదుగా, పెన్నా బేసిన్‌కు తరలించనున్నారు.
రూ.80వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ దూకుడుగా ముందుకు సాగుతున్నది. ఈ ప్రాజెక్టు అలైన్మెంట్ మొత్తం ఏపీగుండానే పోవడంతోపాటు, అక్కడి ప్రాంతాలకే గోదావరి జలాలను తరలించనున్నారు. కాగా గోదావరిలో వరద జలాలేమీ లేవని, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మళ్లించే జలాల్లో వాటా కావాలని తెలంగాణ పట్టుబడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రతిపాదిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది. దీనిపైనే తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్లు స్పందిస్తూ.. జీబీ లింక్ ప్రాజెక్టు కంటే గతంలో కేసీఆర్ సర్కారు చేసిన రివర్స్ పంపింగ్ విధానమే సాంకేతికంగా, ఆర్థికంగా మెరుగైనదని, అది ఇరు రాష్ర్టాలకు లాభదాయకమని వెల్లడిస్తున్నారు.
కృష్ణా రివర్ బేసిన్లో రెండు రాష్ర్టాలు చేపట్టిన ప్రాజెక్టులకు దాదాపు 1000 టీఎంసీలకు పైగా అవసరముంటుంది. మరోవైపు కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్-2 ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను ఐదు మీటర్ల వరకు పెంచుకుని 125 టీఎంసీలను వినియోగించుకునేందుకు కర్ణాటక రాష్ర్టానికి అవకాశాన్ని కల్పించింది. రేపటి రోజున అవార్డు అమల్లోకి వస్తే కృష్ణాలో నీటిలభ్యత మరింతగా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో కృష్ణాలో ఏర్పడుతున్న నీటిలోటును గోదావరి ద్వారా పూడ్చుకోవాలన్న ప్రతిపాదనలు తెరమీదికి వచ్చాయి. ఈ అంశంపై ఇరు రాష్ర్టాలు పలుమార్లు సంప్రదింపులు జరుపుకున్నాయి. అందులో భాగంగా కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు తక్కువ వ్యయంతో, ఎలాంటి అదనపు భూసేకరణ లేకుండానే గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించేందుకు ప్రణాళికలను రూపొందించింది. దాని ప్రకారం పోలవరం కుడికాలువకు సమాంతరంగా మరో కాలువను తవ్వి తద్వారా రోజుకు రెండు టీఎంసీల చొప్పున గోదావరి జలాలను తొలుత ప్రకాశం బరాజ్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి దాని ఎగువన ఉన్న వైకుంఠపురం లిఫ్ట్‌కు ఎత్తిపోస్తారు. వైకుంఠపురం బ్యాక్ వాటర్ నుంచి రెండు సొరంగ మార్గాల ద్వారా పులిచింతల బరాజ్‌కు లిఫ్ట్ చేస్తారు.
పులిచింత బరాజ్ ఎగువన మరో లిఫ్ట్‌ను ఏర్పాటుచేసి నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌కు తరలిస్తారు. అక్కడ ఇప్పటికే జలవిద్యుత్తు ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన రివర్సబుల్ టర్బైన్స్ ద్వారా జలాలను నాగార్జునసాగర్ డ్యామ్‌లోకి ఎత్తిపోస్తారు. ఆపై సాగర్ బ్యాక్ వాటర్ నుంచి జలాలను శ్రీశైలం జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలోని రివర్సబుల్ టర్బైన్స్‌కు తరలించి, ఆపై జ లాలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అటు ఏపీ పోతిరెడ్డిపాడు, బనకచర్ల ద్వారా జలాలను వినియోగించుకునే అవకాశముంటుంది. ఇటు తెలంగాణ ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి, డిండితోపాటు ఇతర ప్రాజెక్టులకు నికర జలాల భరోసా లభిస్తుంది. ఈ రివర్స్‌పంపింగ్ కోసం రూ.25 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. గోదావరి జలాల వినియోగంతోపాటు, జలవిద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రతిపాదనలపై 2019లో అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్ ఇరువురూ చర్చలు జరిపారు. కానీ ఏపీ ఈ ప్రాతిపదనలను తిరస్కరించింది. ఏపీ గోదారి జలాలను మళ్లించుకునేలా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనిపై ఇప్పుడు తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేస్తుండగా, రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్లు సైతం ఘాటుగా స్పందించారు. ఏపీ తన ప్రతిపాదనలు విరమించుకోవాలని సూచిస్తున్నారు.