సెంట్రల్ వాటర్ కమిషన్ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే సుమారు 16 నుంచి 46 శాతం తకువగా ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ప్రాణహిత మాత్రమే ఎల్లప్పుడూ ప్రవహించే నది.ఒక్కమాటలో చెప్పాలంటే.. రాష్ట్రంలో నీరు లేని పరిస్థితుల్లోనూ ప్రాణహిత-గోదావరిలో వినియోగయోగ్యమైన వరద ప్రవాహాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ మూడు లిప్టుల వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడమే అత్యంత సమంజసం.
హైదరాబాద్, జూలై 9(నమస్తే తెలంగాణ) : ఎల్ నినో సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపింగ్ స్టేషన్ల నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టి, తద్వారా పంటలు.. రైతుల ప్రయోజనాలను కాపాడాలని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం డిమాండ్ చేసింది. బరాజ్‌ల్లో ఎండీడీఎల్(మినిమమ్ డ్రా డౌన్ లెవల్) మేరకు జలాలను నిల్వ చేయవచ్చని, తద్వారా ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు సంఘం గౌరవాధ్యక్షుడు జీ దామోదర్‌రెడ్డి, అధ్యక్షుడు ఎం శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, అసోసియేట్ ప్రెసిడెంట్ డీ సాంబయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు, జలాశయాల పరిస్థితి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టుల వినియోగం ప్రణాళికలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వర్షాలు పడటం లేదని, మరోవైపు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే సుమారు 16-46 శాతం తకువగా ఉన్నాయని వివరించారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రాణహిత నది మాత్రమే ఎల్లప్పుడూ ప్రవహించే నది అని, ఒక్కమాటలో చెప్పాలంటే.. రాష్ట్రంలో నీరు లేని పరిస్థితిలోనూ ప్రాణహిత-గోదావరిలో వినియోగయోగ్యమైన వరద ప్రవాహాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ మూడు లిప్టుల వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడం అత్యంత సమంజసమని అభిప్రాయం వ్యక్తంచేశారు.
ప్రాణహిత వరద ప్రవాహం తగినంతగా ఉన్నప్పుడు మేడిగడ్డ బరాజ్ నీటిని లిఫ్ట్ చేయడానికి అవకాశమున్నదని, అకడ హైడ్రాలిక్ స్థితి అనుకూలంగా ఉందని వారు వివరించారు. మేడిగడ్డ జలాశయ కనిష్ఠ డ్రా డౌన్ స్థాయి(ఎండీడీఎల్) +93.500 మీటర్లు అని, ప్రస్తుతం గేట్లు పూర్తిగా తెరిచి ఉన్న పరిస్థితిలోనూ ప్రాణహిత వరద నీటి మట్టం సుమారు 97.5మీటర్లు ఉన్నదని, కన్నెపల్లి పంపింగ్ స్టేషన్‌కు నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన హెడ్ ఉన్నదని తెలిపారు. తద్వారా కన్నెపల్లి పంప్‌హౌస్ రోజుకు సుమారు 3టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నదని వివరించారు. ఎగువన అన్నారం, సుందిల్ల జలాశయాలను వాటి కనిష్ఠ డ్రా-డౌన్(ఎండీడీఎల్) స్థాయిల వద్ద నిల్వ చేయాలని, అన్నారం వద్ద 116.500 మీటర్లు లెవెల్, సుందిల్ల వద్ద 126.500 మీటర్లు లెవెల్ మెయింటెయిన్ చేయాలని, ఆ స్థాయిల్లో బరాజ్‌లు సురక్షిత పరిధిలోనే ఉంటాయని స్పష్టంచేశారు.
మూడు పంపింగ్ స్టేషన్లు ఒకేసారి సమన్వయంతో పనిచేయగలుగుతాయని వివరించారు. అన్నారం జలాశయంలో సుమారు 5.1టీఎంసీలు, సుందిల్లలో సుమారు 3.78 టీఎంసీలు కలిపి మొత్తం 8.8టీఎంసీల వరకు నిల్వ సామర్థ్యం ఉంటుందని, ఒకవేళ రెండు బరాజ్‌లు ఒకేసారి ప్రమాదానికి గురైనా ఆ 8.8 టీఎంసీల నీరు అంటే సుమారు 1.02 లక్షల క్యూసెకుల ప్రవాహ వేగంతో 24గంటలు మాత్రమే ఉంటుందని, అలాగే 2.04 లక్ష క్యూసెకులు 12గంటలు, 4.08 లక్ష క్యూసెకులు 6గంటలు, 8.16 లక్ష క్యూసెకులు 3గంటలు మాత్రమే ఉంటుందని వివరించారు. గతంలో మేడిగడ్డ వద్ద నమోదైన ప్రాణహిత ఆధారిత ప్రవాహం వరద రోజుల్లో పలుమార్లు పది లక్షల క్యూసెకులపై స్థాయికి చేరిందని తెలుపుతున్నాయని, అందువల్ల ఇలాంటి వరద సమయంలో కూడా 3-6 గంటల్లో సుమారు 8.8టీఎంసీల వరకు నీటిని ఆ 3 లిఫ్టుల గొలుసులోకి వచ్చినా ఆస్తి నష్టం, ప్రాణనష్టం, ఊర్ల ముంపు వంటి అపాయాలు గత అనుభవాల ప్రకారం కనిపించలేదని విశ్రాంత ఇంజినీర్లు నొక్కిచెప్పారు.
ప్రాణహితలో వరద నీటిమట్టం మేడిగడ్డ ఎండీడీఎల్ కంటే ఎత్తుగా కొనసాగుతున్నంతకాలం, మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్స్టేషన్ నీటిని లిఫ్ట్ చేసి, అన్నారం, సుందిల్ల బరాజ్‌లను ఎండీడీఎల్ స్థాయిల వద్దే కొనసాగిస్తూ, నీటిని ఎల్లంపల్లి వరకు తరలించవచ్చని, అది హైడ్రాలిక్పరంగా స్థిరమైన, నమ్మకమైన విధానమని వారు స్పష్టంచేశారు. గత వరద అనుభవాల ప్రకారం, సాంకేతిక నియమాలకు లోబడి, జాగ్రత్తతో, సురక్షిత పద్ధతుల్లో లిఫ్టులను నడిపితే గ్రామాల ముంపు, ఆస్తి నష్టం, ప్రాణనష్టం వంటి ప్రమాదాలు లేకుండానే నీటి పంపింగ్ వ్యవస్థను సఫలీకృతంగా వినియోగించుకోవచ్చని విశ్రాంత ఇంజినీర్లు పునరుద్ఘాటించారు. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఎల్ నినో సంక్షోభం నేపథ్యంలో పంటలు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల మూడు పంపింగ్ స్టేషన్లను వెంటనే ఆపరేషన్లోకి తీసుకువచ్చే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ లక్ష్యసాధన కోసం, ప్రజల, ముఖ్యంగా రైతుల ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ తమ సేవలను స్వచ్ఛందంగా అందించేందుకు సైతం సిద్ధంగా ఉన్నదని ఆ ప్రకటనలో ప్రభుత్వానికి వెల్లడించారు.