Kaleshwaram commission : తెలంగాణ రిసెర్చ్ అధికారులు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు.
జాయింట్ డైరెక్టర్ తోపాటు చీఫ్ ఇంజినీర్, ఇతర ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరైన వారిలో ఉన్నారు. మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా..? అని ఈ సందర్భంగా రిసెర్చ్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది. కన్స్ట్రక్షన్కు ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు రిసెర్చ్ ఇంజినీర్లు తెలిపారు.
మోడల్ స్టడీస్ పూర్తికాకముందే కన్స్ట్రక్షన్ మొదలైనట్లు కమిషన్ ముందు రిసెర్చ్ ఇంజినీర్లు ఒప్పుకున్నారు. మేడిగడ్డతో పాటు ఇతర డ్యామేజ్ జరగడానికి కారణం నీళ్లను స్టోరేజ్ చేయడమేనని కమిషన్ ముందు రిసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించారని తెలిపారు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్‌లో మార్పులు, సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని చెప్పారు.
బ్యారేజీలు డామేజ్ అవ్వడానికి, మోడల్ స్టడీస్‌కు సంబంధం లేదని రిసెర్చ్ అధికారులు కమిషన్‌కు చెప్పారు. మూడు బ్యారేజీల్లో నీళ్లు నిలువ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని..? రిసెర్చ్ ఇంజనీర్లను కాలేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. అన్నారం బ్యారేజీ నిర్మాణం చేసే లొకేషన్ మారినట్లు రిసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా..? అని అడిగింది. ఈ సందర్భంగా నిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్ఎల్ పని చేసిందని కమిషన్ ముందు ఇంజనీర్లు చెప్పారు.
లొకేషన్, సీడీవో అథారిటీ రిపోర్ట్స్ ఆధారంగా రిసెర్చ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం మూడు బ్యారేజీల్లో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్.. రిసెర్చ్ టీమ్ ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒకవైపు నిర్మాణం జరుగుతుండగానే మరొక వైపు రిసెర్చ్ కొనసాగుతుందని ఇంజనీర్లు చెప్పారు.