హైదరాబాద్, జూన్ 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి రెండు నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలోనే ఉన్నది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన రూ.2,738.90 కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్తో పోలిస్తే రెవెన్యూ లోటు రూ.5,037.39 కోట్లుగా ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.54,009.74 కోట్ల ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేయగా మే నెలాఖరు నాటికే అది రూ.9,389.90 కోట్లకు చేరింది. ప్రాథమిక లోటు రూ.5,223.55 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేయడం.. వడ్డీ చెల్లింపులు జరపకముందే ప్రభుత్వ ఖర్చు రాబడి కంటే అధికంగా ఉన్నట్టు స్పష్టం చేస్తున్నది. మే నెలకు సంబంధించి తాజాగా కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.32,823 కోట్ల రాబడులు వచ్చాయి. ఇవి రూ.2.84 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ అంచనాల్లో 11.52 శాతానికి సమానం.
ఇందులో రూ.22,609 కోట్ల పన్ను రాబడి, రూ.729.93 కోట్ల పన్నేతర రాబడి, కేంద్ర ప్రభుత్వం నుంచి నామమాత్రంగా వచ్చిన రూ.86.73 కోట్ల గ్రాంట్లు కలిపి మొత్తం రూ.23,452 కోట్ల రెవెన్యూ రాబడులు వచ్చాయి. గతేడాది మే నెలతో పోలిస్తే ఈసారి పన్ను రాబడి స్వల్పంగా దాదాపు రూ.200 కోట్లు పెరగడంతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అమ్మకం పన్ను వసూళ్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా మెరుగుపడినప్పటికీ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు నిరుటి కంటే తక్కువగానే ఉన్నాయి. పన్ను వసూళ్లు ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వృద్ధి చెందలేదు. ప్రభుత్వ మొత్తం ఖర్చు రూ.31,740 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్న రూ.2.63 లక్షల కోట్లలో దాదాపు 12.05 శాతానికి సమానం. కాగా, ప్రభుత్వం తన రూ.16,345.23 కోట్ల వార్షిక సబ్సిడీ కేటాయింపుల్లో ఇప్పటికే 31 శాతానికిపైగా (రూ.5,199 కోట్లు) రెండు నెలల్లోనే ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంతో పోలిస్తే ఇది చాలా పెద్ద తేడా. వార్షిక కేటాయింపుల్లో ఇది 12.81 శాతానికి సమానం.
రాష్ట్ర ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గింది. తెలంగాణ అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లో మూలధన వ్యయం కింద రూ.3,277 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇది రూ.36,504.45 కోట్ల లక్ష్యంలో కేవలం 8.98% మాత్రమే. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వెనుకబడినట్టు ఇది స్పష్టం చేస్తున్నది. దీని వల్ల సమీప భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోవచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లోనే మార్కెట్ నుంచి నికరంగా రూ.9,389.90 కోట్ల రుణాలు తెచ్చింది. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా సమీకరించాలనుకున్న రూ.54,009 కోట్ల నికర రుణాల్లో దాదాపు 17.39 శాతానికి సమానం. ఇలా రాష్ట్ర రుణభారం పెరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పన్ను ఆదాయ వృద్ధి స్థిరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ బాధ్యతలు, ముఖ్యంగా సబ్సిడీలు, పెన్షన్లు భారీగా పెరగడం వల్ల మున్ముందు తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత అధికమవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.