Weather | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. ఉదయం పొగమంచు ఊపిరి ఆడనివ్వటం లేదు. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తకువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. భద్రాచలం, హకీంపేట, ఖమ్మం, రామగుండం, పటాన్చెరు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కన్నా తకువగా నమోదవుతున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 14 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అకడకడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేదని, పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది సాధారణం కంటే ఎకువ వర్షాలు కురిసినట్టు వెల్లడించారు.