హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): దేశ వైద్యవిద్యలో తెలంగాణ రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యంలో మరో మైలురాయిని అందుకొన్నది. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలకు అనుమతి సాధించింది. దీంతో ఒకే ఏడాది అత్యధిక మెడికల్ కాలేజీలు స్థాపించిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది. నిరుడు కూడా రాష్ట్రంలో ఒకేసారి 8 కాలేజీలు ప్రారంభమై ఇంతకు ముందు నమోదు చేసిన రికార్డును తానే అధిగమించింది. ఇదే ఏడాది కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ తాజాగా అనుమతి ఇచ్చింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగామ, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ మెడికల్ కాలేజీలు ఈ ఏడాది ఎన్ఎంసీ గుర్తింపు పొందాయి. దీంతో విద్యార్థులకు ఈ ఏడాది నుంచి అదనంగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 5 మెడికల్ కాలేజీలే ఉండేవి. తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరింది.
గడువులోగా పెండింగ్ పనులు పూర్తిచేయండి
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టిన పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. బుధవారం ఆయన టీఎస్ఎంఎస్ఐడీసీ, ఎన్హెచ్ఎం కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రూ.35 కోట్లతో గాంధీ దవాఖానలో నిర్మిస్తున్న అవయవ మార్పిడి కేంద్రం పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.16.5 కోట్లతో గాంధీ, ఎంజీఎం, పేట్ల బురుజు దవాఖానల్లో ఏర్పాటు చేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్ల పనులు త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పారు మెడికల్ కాలేజీలు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలు గడువులోగా పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్స్‌ను ప్రారంభించాలని ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 14న నిర్వహించే వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీసీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చేరువైన వైద్యవిద్య
రాష్ర్టానికి 9 మెడికల్ కళాశాలలకు అనుమతి రావడంపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. దీంతో వైద్యవిద్యలో తెలంగాణ ఉన్నత శిఖరాలను చేరుకొన్నదని, సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైనదని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలోనే తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల సంఖ్య 5 నుంచి 26కు పెరిగిందని తెలిపారు. దీంతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందడంతో పాటు రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య చేరువయ్యింది.. అని మంత్రి ట్వీట్ చేశారు.