హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణానికి మించి 30 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో సరాసరి సగటు భూగర్భ జలాల నీటిమట్టం 8.73 మీటర్లుగా నమోదైంది. నిరుడు ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.29 మీటర్లు పెరుగుదల నమోదైనట్టు రాష్ట్ర భూగర్భ జలశాఖ మంగళవారం విడుదల చేసిన ఏప్రిల్ నెల నివేదికలో వెల్లడించింది.
అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 4.83 మీటర్లు, అత్యధికంగా మెదక్ జిల్లాలో 15.36 మీటర్లుగా భూగర్భ జలమట్టాలు నమోదయ్యాయి. జిల్లాలవారీగా నిరుడు ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది 19 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పెరుగుదల నమోదైంది. భద్రాద్రిలో 0.06 మీటర్లు అత్యల్పంగా నమోదు కాగా, భూపాలపల్లిలో అత్యధికంగా 3.97 మీటర్లుగా ఉన్నది. మరో 14 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల తగ్గుదల నమోదైంది. అత్యల్పంగా వరంగల్‌లో 0.03 మీటర్లు, అత్యధికంగా మేడ్చల్‌లో 1.90 మీటర్లు తగ్గుదల నమోదైంది. గత పదేండ్ల ఏప్రిల్ నెల భూగర్భ జలమట్టాలను పరిశీలిస్తే 548 మండలాల్లో పెరుగుదల, 46 మండలాల్లో తగ్గుదల కనిపిస్తున్నది.