Telangana Realtors Association | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ ) : ఫామ్ ప్లాట్ల విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిధి దాటి మాట్లాడుతున్నారంటూ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మండిపడింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారెవరూ రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకుని బతుకొద్దా? అని ప్రశ్నించింది. ఫామ్ సైట్లను కొనొద్దని చెప్పడానికి హైడ్రాకు ఎలాంటి హక్కు ఉన్నదని, ప్రభుత్వం ఆ బాధ్యతలను హైడ్రాకు ఎప్పుడు అప్పగించిందని నిలదీసింది. చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కుల పరిరక్షణ బాధ్యతలను మాత్రమే హైడ్రాకు కట్టబెట్టిందని పేర్కొన్నది.
కానీ, హైడ్రా కమిషనర్ మాత్రం ఫాం సైట్లను కొనుక్కోవద్దని వ్యాఖ్యానించడం రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగాన్ని నేలమట్టం చేయడంలో భాగమని మండిపడింది. హైడ్రా ఇప్పటివరకు ఏ ఒక్క చెరువునైనా రక్షించగలిగిందా? రాజకీయ నాయకులు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను విడిపించారా? అని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. కనీసం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రీ లాంచ్ అమ్మకాలను నిలవరించకుండా చిన్న చితక రియల్ఎస్టేట్ వ్యాపారులను బలిపీఠం ఎక్కేలా హైడ్రా, కమిషనర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఫాం ప్లాట్లు ప్రభుత్వ భూములు కాదని, ఎమ్మార్వోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, పాస్‌బుక్ కూడా వస్తుందని, నాలా కన్వర్షన్ చేస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు భూమి కొనుక్కోవద్దనే ధోరణిలో హైడ్రా పనితీరు ఉన్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీపీ లేవుట్లలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని, ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన విషయం హైడ్రా కమిషనర్‌కు తెలియకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. తెలంగాణ రియల్టర్లను బలి చేసేలా ప్రభుత్వం హైడ్రా లాంటి సంస్థలను ఊసిగొల్పే ప్రయత్నాలను మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే గనుక జరిగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పది లక్షల మంది రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్రచారం చేస్తారని హెచ్చరించారు.