హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో భారీగా పెట్టుబడులు రాబట్టుకుని దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ.. కాంగ్రెస్ హయాంలో ఘోరంగా వెనుకబడుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు త్రైమాసికాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలకు వచ్చిన పెట్టుబడుల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలువడమే ఇందుకు నిదర్శనం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ (సీఎంఐఈ) డాటాబేస్ ఆధారంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించిన వివరాల ప్రకారం నిరుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 16 రాష్ర్టాలకు మొత్తం రూ.26.62 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో తెలంగాణ వాటా కేవలం 9.5 శాతమే. పొరుగు రాష్ట్రమైన ఏపీ ఏకంగా 25.3% పెట్టుబడులను దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా (13.1%), మహారాష్ట్ర (12.8%) ఉన్నాయి. 0.9% వాటాతో జార్ఖండ్, అస్సాం చివరి స్థానంలో నిలిచాయి.
మొత్తం పెట్టుబడుల్లో విద్యుత్తు, గ్రీన్ ఎనర్జీ రంగాలు 22.6% వాటాతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత కెమికల్స్, కెమికల్ ప్రొడక్ట్స్(21.8%), మెటల్స్(17.3%), ఐటీ(10.9%), రవాణా(7.9%) రంగాలు ఉన్నాయి. 17 రంగాల్లో ఈ ఐదు రంగాలకే 80% పెట్టుబడులు రావడం విశేషం. తెలంగాణకు గత రెండేండ్లలో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు కాంగ్రెస్ సర్కార్ ఊదరగొడుతున్నది. కానీ, ఒప్పందాల్లో భాగంగా ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు రూ.50 వేల కోట్లలోపే ఉన్నట్టు టీజీఐఐసీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడుల సాధనలో ఎంతో దూకుడుగా వ్యవహరించింది. ప్రఖ్యాత వస్త్ర తయారీ సంస్థ ‘కిటెక్స్’ శ్రీలంకతోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ను కాదని రాష్ట్రంలో దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. నాటి సీఎం కేసీఆర్ చొరవ, కేటీఆర్ ప్రత్యేక కృషి, టీఎస్ ఐపాస్ లాంటి పారదర్శక విధానాల వల్ల అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లింది. గత రెండేండ్లుగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సహా పలు ఇతర రంగాలు ఘోరంగా పతనమవడం ఇందుకు ఓ కారణమని పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి.
పెట్టుబడుల్లో రాష్ర్టాలు సాధించిన వాటా
రాష్ట్రం ; శాతం
రంగాలవారీగా వాటా
రంగం = శాతం
విద్యుత్తు = 22.6
కెమికల్స్ = 21.8
మెటల్స్ = 17.3
ఐటీ = 10.9
రవాణా = 7.9
మెషినరీ = 4.9
కన్స్ట్రక్షన్, రియల్ఎస్టేట్ = 4.0
మిసిలేనియస్ సర్వీసెస్ = 2.7
ట్రాన్స్పోర్ట్ ఎక్యిప్మెంట్ = 1.6
టెక్స్టైల్స్ = 1.4
కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ = 1.3
ఫుడ్ అండ్ ఆగ్రో = 1.2
మిసిలేనియస్ మ్యానుఫ్యాక్చరింగ్ = 0.9
మైనింగ్ = 0.6
కన్జ్యూమర్ గూడ్స్ = 0.4
హోటల్స్ అండ్ టూరిజం = 0.3
హోల్‌సేల్ అండ్ రిటైల్ ట్రేడింగ్ = 0.2