Alcohol Consumption | హైదరాబాద్, నవంబర్ 01( నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం విక్రయాలు నియంత్రిస్తామని, బెల్టు షాపులు మూసివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయింది. పైగా కార్యకర్తలకు ఉపాధి మార్గంగా బెల్టు షాపులు పెట్టుకోవాలని ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లో దిగువ శ్రేణి కార్యకర్తలు అడిగిందే తడువుగా బెల్టు దుకాణాలు పెట్టుకోవాలని అధికార పార్టీ నేతలు సూచిస్తున్నారు. దీంతో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ-(ఎన్ఐపీఎఫ్పీ) ‘రెవెన్యూ మొబలైజేషన్ ఫ్రమ్ టాక్సెస్ ఆన్ ఆల్కహల్ బేవరేజస్’ అంశంపై సర్వే చేయగా తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం దక్కించుకుంది. సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి.
దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఐపీఎఫ్పీ సర్వే చెసింది. మద్యంపై పెడుతున్న ఖర్చు, జనాభాను పరిగణలోకి తీసుకోగా తెలంగాణలో ఒకరు సగటున ఏడాదికి రూ.1,623 మద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తం ఏపీలో రూ.1306గా ఉండగా ఆ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక ఏటా మద్యంపై రూ.1245 సగటు వ్యయంతో పంజాబ్ జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది. అత్యల్పంగా మద్యం సేవించే రాష్ట్రంగా బెంగాల్ ఉంది. ఆ రాష్ట్రంలో అతి తక్కువగా ఏడాదికి ఒక వ్యక్తి సగటున రూ.4 నాలుగు మాత్రమే మద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. అక్కడ ఒక వ్యక్తి సగటున రూ.49 మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు సర్వేలో తేలింది.
తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు ఉండగా, మరో వెయ్యి వరకు బార్లు, పబ్బులు ఉన్నాయి. ఇటీవల దసరా పండక్కే దాదాపు రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 11 లక్షల కేసుల విస్కీ, బ్రాందీ, 18 లక్షల కేసుల బీర్లు మద్యం వినియోగదారులు తాగారు. దేశం లో అత్యధిక బీర్లు కొనుగోలు చేస్తున్న రా ష్ట్రంగా కూడా తెలంగాణ గుర్తింపు పొం దింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 3.3 కోట్ల మంది బీర్లు తాగినట్టు ఎన్ఐపీఎఫ్పీ తేల్చింది. ఇందులో ఒక జాతీయ మద్యం కంపెనీ విక్రయాలే అధికం. మరోవైపు కాంగ్రెస్ నేతల ప్రోత్సాహంతో అనుచరులు ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులు తెరుస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల బెల్టు దుకాణాలు నడుస్తున్నట్టు అంచనా. దీంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో వెనుకబడుతున్న తెలంగాణ మద్యం విక్రయాల్లో మాత్రం ముందు నిలిచింది.