హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు.. ఇప్పటివరకూ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, పూట గడవడమే కష్టంగా ఉన్నదని ప్రచారం చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదలు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అనేక వేదికల్లో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినట్టు చెప్పుకొచ్చారు. వస్తున్న ఆదాయం అప్పులకు వడ్డీలు కట్టేందుకే సరిపోవడం లేదని దీనికంతటికీ కారణం పదేండ్ల బీఆర్ఎస్ పాలన అంటూ నిందలు మోపారు. రాష్ట్రం అప్పు రూ.6 లక్షల కోట్లు అని ఒకరంటే, కాదు రూ.7 లక్షల కోట్లని పోటీలు పడి రుణ మొత్తాన్ని పెంచేశారు. కానీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం గణాంకాలతో సహా వాస్తవాలను బయటపెట్టింది. దీంతో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు తప్పని రుజువైంది.
అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో రూ.1.5 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసినా కూడా అతి తకువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్టు నిరూపితమైంది. ఈ ఏడాది మార్చి 31 వరకు తెలంగాణ రూ.4,42,298 కోట్లు మాత్రమే అప్పు చేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో (జీఎస్డీపీ)లో అది కేవలం 26.2 శాతం అని పే ర్కొంది. దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ర్టాల్లో తెలంగాణ 24వ స్థానంలో, ఏపీ 12వ స్థానంలో ఉన్నాయి. 2025 మార్చి 31 నాటికి దేశంలోని వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్న అప్పులపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్‌తివారీ సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌదరి గణాంకాలతోసహా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రిజర్వు బ్యాంకు అంచనా ప్రకారం.. 2025 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్రం అప్పు రూ.4,42,298 కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. కేంద్రం విధించిన రుణ పరిమితి (ఎఫ్ఆర్బీఎం)కి లోబడి జీఎస్డీపీలో కేవలం 26.2 శాతం రుణ సమీకరణ చేసిందని చెప్పారు.
దేశంలోనే అన్ని రాష్ర్టాల కంటే అత్యధికంగా తమిళనాడు రూ.9,55,691 కోట్లు అప్పు చేయగా, ఉత్తరప్రదేశ్ రూ.8,57,844 కోట్లు, మహారాష్ట్ర రూ.8,12,068 కోట్లు, పశ్చిమబెంగాల్ రూ.7,14,196 కోట్లు, కర్ణాటక రూ.7,25,456 కోట్ల రుణాలతో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. జీఎస్డీపీలో అత్యధికంగా అరుణాచల్‌ప్రదేశ్ 57 శాతం, ఒడిశా అత్యల్పంగా 16.3 శాతంతో అప్పులు తీసుకున్నాయి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీలో 34.7 శాతం అనగా రూ.5,62,557 కోట్లు రుణాలు తీసుకున్నది. జీఎస్డీపీ ప్రకారం అప్పుల్లో టాప్ ఐదింటిలో అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ రాష్ర్టాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పు రూ.2,67,35,462 కోట్లు ఉన్నట్టు కేంద్ర మంత్రి వివరించారు.