Rains | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతున్నదని, దీంతో 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అత్యధికంగా మంచిర్యాల జిల్లా భీమారంలో 43.4 డిగ్రీలు, భదాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 43.3 డిగ్రీలు, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాలలో 43.3 డిగ్రీల చొప్పున నమోదైనట్టు వెల్లడించింది. వచ్చే రెండ్రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నది.
తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడిందని, అదేవిధంగా మహారాష్ట్ర సమీపంలోని తెలంగాణ ప్రాంతంలో యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ సముద్రమట్టం నుంచి 3.1 కి.మీ -5.6 కి.మీ మధ్య కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.