హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిగాక, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిన తరువాతనే టెలిమెట్రీల ఏర్పాటు జరుగుతుందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు లేఖ రాసింది. 19వ బోర్డు సమావేశంలో టెలిమెట్రీల ఏర్పాటు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.4.15 కోట్ల నిధులను విడుదల చేసింది.
మరోవైపు టెలిమెట్రీల ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తిశాఖ దృష్టికి బోర్డు తీసుకెళ్లింది. కేంద్రం వెల్లడించిన అంశాలతో తాజాగా ఇరు రాష్ర్టాలకు లేఖ రాసింది. 2021లో విడుదల చేసిన రివర్ బోర్డు గెజిట్ ప్రకారం ప్రాజెక్టులను పూర్తిగా బోర్డుకు అప్పగించాల్సి ఉంటుందని తెలిపింది. తెలంగాణ విడుదల చేసిన రూ.4.15 కోట్లను బోర్డు నిర్వహణకు వినియోగించుకుంటున్నామని తెలిపింది.
ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ జలదోపిడీని నిలువరించేందుకు 2వ దశ టెలిమెట్రీల ఏర్పాటుకు పట్టుబట్టి ఒప్పించామని ప్రకటించారు. కానీ కేఆర్ఎంబీ లేఖతో అదంతా వట్టిదేనని తేలిపోయింది. కృష్ణా జలాల వినియోగ లెక్కలను గణించేందుకు మొదటివిడతగా నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీని కలుపుకొని మొత్తం 18 చోట్ల టెలిమెట్రీలను కేఆర్ఎంబీ గతంలోనే ఏర్పాటుచేసింది. సీడబ్ల్యూపీఆర్ఎస్ సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి దానిపై కేఆర్ఎంబీ అధ్యయనం చేయించింది. సాగర్, శ్రీశైలం వద్ద తప్ప మిగిలిన చోట్ల టెలిమెట్రీలు కచ్చితమైన నీటిప్రవాహ సామర్థ్యాన్ని సూచించడం లేదని స్పష్టంచేసింది.
సీడబ్ల్యూపీఆర్ఎస్ సూచనల మేరకు టెలిమెట్రీల లొకేషన్ల మార్పుతోపాటు, రెండోదశలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు సంబంధించి 9 ఔట్లెట్లపై టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని 2020లో జరిగిన 14వ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. అందులో శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, సాగర్ కుడి కాలువ, సాగర్ ఎడమ కాలువ, పాలేర్ రిజర్వాయర్ ఎగువన ఎడమ కాలువపై 136.35కి.మీ వద్ద, సాగర్ ఎడమ కాలువ 101.36కి.మీ ఏపీ బార్డర్ వద్ద, పోలవరం కెనాల్, ప్రకాశం బరాజ్ పశ్చిమ కాలువ, ప్రకాశం బరాజ్ తూర్పు ప్రధాన కాలువ, కర్నూలు కడప (కేసీ) కెనాల్ ఉన్నాయి. రూ.7.18 కోట్లు అవసరమవుతాయని అప్పుడే అంచనా వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీశైలం నుంచి ఏపీ ఇష్టారీతిన జలాలను మళ్లించుకుపోతున్నది.