హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారని చెప్పారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మన ఊరు-మన బడి కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత విద్యా ప్రమాణాలతో పాఠశాల స్థాయి నుంచే విద్యాబుద్ధులు నేర్పాలనే ఉన్నత లక్ష్యంతో సర్కారు ముందుకెళ్తున్నదని చెప్పారు. మన ఊరు-మన బడి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని టీసీఎస్ ప్రతినిధులకు మంత్రి సూచించారు. పాఠశాలలవారీగా జాబితా రూపొందించి సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. తొలిదశలో ఎంపిక చేసిన 9,123 పాఠశాలల్లో 12 రకాల సౌకర్యాలు కల్పించేందుకు రూ.3,497 కోట్లు ఖర్చు చేయనున్నామని, ఈ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. త్వరలోనే జిల్లా స్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి పథకం అమలుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవబోతున్నదని చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యా సంచాలకురాలు శ్రీదేవసేన, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఎండీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.