హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపులో సర్కారు జాప్యం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్డిరాజు రాకేశ్ వెల్లడించారు. రూ.1,400 కోట్ల బకాయి ఉంటే ప్రభుత్వం సోమవారం రూ.100 కోట్లు విడుదల చేసినట్టు చెప్తున్నదని తెలిపారు. ప్రభుత్వ వైఖరి కారణంగా నెట్వర్క్ దవాఖానల నిర్వహణ కుప్పకూలే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. పెండింగ్ బకాయిల అంశం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, వైద్య, ఆరోగ్యశాఖ పరిధిని ఎప్పుడో దాటిపోయిందని, ఈ విషయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. గత తొమ్మిది నెలల్లో ముగ్గురు ఆరోగ్యశ్రీ సీఈవోలు మారారని, వారందరికీ వినతిపత్రాలు ఇచ్చి అలసిపోయామని చెప్పారు.
ప్రభుత్వం ప్రతి నెలా రూ.100 కోట్ల బకాయిలు చెల్లిస్తే రూ.1,400 కోట్ల బకాయిలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ దవాఖానలకు రూ.100 కోట్లు ఏ మూలకూ సరిపోవని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు మొత్తం క్లియర్ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. గ్రీన్ చానల్ ద్వారా ప్రతి నెలా రూ.200 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్లు ఉంటే అందులో ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి రూ.రెండు వేల కోట్లు ప్రభుత్వం వద్ద లేవా? అని ప్రశ్నించారు. తమ సమస్యలను ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. పెద్ద కార్పొరేట్ దవాఖానలకు బిల్లులు రాకున్నా.. పెద్దగా నష్టమేమీ ఉండదని, కానీ జిల్లాల్లో చాలామంది సింగిల్‌గా, కపుల్‌గా, నలుగురు స్నేహితులు కలిసి దవాఖానలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరంతా పెట్టుబడి కోసం బయటి నుంచి భారీగా అప్పులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ సేవలు అందించారని తెలిపారు.
ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలి: సీఈవో
ఆరోగ్యశ్రీ వైద్యసేవల నిలిపివేత నిర్ణయాన్ని నెట్వర్క్ దవాఖానల యాజమాన్యాలు వెనకి తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతోపాటు గడిచిన 21 నెలల్లో రూ.1,779 కోట్లను దవాఖానలకు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1,375 రకాల వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికిపైగా పెంచినట్టు గుర్తుచేశారు. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్యసేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి పేషెంట్లను ప్రభుత్వం ఆదుకున్నదని వివరించారు. చార్జీల పెంపు, కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా రూ.487.29 కోట్లు పేషెంట్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని వివరించారు. ప్రస్తుతం నెలకు రూ.95 కోట్లు చెల్లిస్తున్నామని, దవాఖానల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకు రూ.వంద కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. దవాఖానాల యాజమాన్యాల ఇతర విజ్ఞప్తుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని తెలిపారు.
ఆరోగ్యశ్రీపై రాజకీయ కుట్ర: దామోదర
కొందరు రాజకీయ దురుద్దేశంతో ఆరోగ్యశ్రీపై కుట్ర చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత అంశంపై ఆయన సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ప్రైవేటు నెట్వర్క్ దవాఖానల ఫెడరేషన్తో నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రతి నెలా రూ.100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ మేరకు వంద కోట్లు విడుదల చేశామని చెప్పారు. ‘అన్ని దవాఖానలు సమ్మెకు వెళ్లేలా లేవని తెలుస్తున్నది. నెట్వర్క్ దవాఖానల్లో రెండు వర్గాలు ఉన్నట్టు తెలిసింది. సోమవారం రూ.100 కోట్లు విడుదల చేసిన వెంటనే అంతకుముందు తేదీతో ప్రెస్‌నోట్ విడుదల చేసి సమ్మె చేస్తామని చెప్పడంలో ఆంతర్యమేంటి?’ అని పేర్కొన్నారు.