హైదరాబాద్,సెప్టెంబర్ 12 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తి వేసేందుకు కాంగ్రస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, అందుకే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. బకాయిల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇంజనీరింగ్ సహా ప్రైవేటు ఉన్నత విద్యా కళాశాలలు ఈ నెల 15 నుంచి కళాశాలల నిరవధిక బంద్కు పిలుపునిచ్చారని తెలిపారు. తరచూ విద్యార్థుల చదువుకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నా సర్కారులో చలనమే లేకుండాపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత మూడేండ్ల నుంచి ఫీజు బకాయిలు రూ.8 వేల కోట్ల వరకు పూర్తిగా పెండింగ్లో ఉన్నాయని, వాటిలో పైసా విడుదల చేయకపోవడంతో విద్యార్థులతోపాటు కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫీజు బకాయిల విడుదలపై సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని ఆరోపించారు. ప్రభుత్వం కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థులను ఏకంచేసి ప్రభుత్వంపై ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.