TS Minister Jagadish Reddy | రూ. లక్ష కోట్లతో తెలంగాణా విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్ రంగాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించామన్నారు. ఉద్యమ కాలంలోనే తెలంగాణ విద్యుత్ రంగాభివృద్ధితోపాటు ఈ సంస్థలను ఎవరీ చేతుల్లో పెట్టాలన్న ప్రణాళికలు రూపొందించుకున్న దార్శనికుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అందువల్లే ఈరోజు యావత్ భారతదేశం లోనే తెలంగాణా విద్యుత్ రంగం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఆయన కితాబిచ్చారు. టియస్యస్పీడీసీఎల్లో కొత్తగా నియమితులైన 1362 మంది జూనియర్ లైన్మెన్లకు శనివారం రాత్రి యస్ ఆర్ నగర్ లోని జెన్కో ఆడిటోరియంలో మంత్రి జగదీష్ రెడ్ది నియామక పత్రాలను అంద జేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో గత తొమ్మిదిన్నరేండ్లలో 35,774 ఉద్యగాలను భర్తీ చేశామన్నారు. ఔట్ సోర్సింగ్ ద్వారా టీఎస్ఎస్పీడీసీఎల్ నియమించిన 10,312 ,ట్రాన్స్ కోలో 4,403 జెన్కో లో 3,689, ఎన్పీడీసీఎల్లో 4,370 మొత్తం కలిపి 22,774 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. అదే విదంగా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా 13,000 మందిని నియమించా మన్నారు.ఇవి గాక మరో 670 ఉద్యగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ ఏర్పాటైన నాడు పీక్ విద్యుత్ డిమాండ్ 5,661 మెఘావాట్లు కాగా, ఇప్పుడు 174% శాతం పెరుగుదలతో 15,497 మెఘావాట్లకు చేరిందని, అదే విదంగా తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లు కాగా, తెలంగాణలో మాత్రం 2,126 యూనిట్లుగా రికార్డు కావడమే అందుకు నిదర్శనమన్నారు. విద్యుత్ రంగం సాధించిన విజయాలతోటే ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు తెలంగాణకు తరలి వస్తున్నారన్నారు.
కను రెప్ప కొట్టినంత సేపు కుడా విద్యుత్ కొరత లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని జగదీశ్ రెడ్డి అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేది కేవలం ఆరు గంటలేనని ఎద్దేవాచేశారు. పరిశ్రమలకు ఇప్పటికీ పవర్ హాలిడేలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, హెచ్ఆర్ డైరెక్టర్ పర్వతం, డైరెక్టర్లు టీ శ్రీనివాస్, జే శ్రీనివాస్ రెడ్డి, మదన్ మోహన్ రావు, కే రాములు, గంప గోపాల్, స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.