హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ రికార్డుల మోత మోగిస్తున్నది. కానీ, విద్యుత్తు ఉత్పత్తి మాత్రం నేలచూపులు చూస్తున్నది. థర్మల్ ప్లాంట్లు పూర్తిగా నడవడం లేదు. టీజీ జెన్కోకు చెందిన ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, యూనిట్ల నిలిపివేతలు గుదిబండగా మారాయి. క్లిష్ట సమయంలో కీలక యూనిట్లు తరచూ మొరాయించడంతో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) పాతాళానికి చేరింది. రాష్ట్రంలో అతిపెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో ఈ నెల 1 నుంచి 11వరకు పీఎల్ఎఫ్ 38.96% మాత్రమే. అంటే ఈ ప్లాంట్ కేవలం మూడో వంతు సామర్థ్యంతో పనిచేస్తున్నది. సాంకేతిక సమస్యలతో పలు విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు నిలిచిపోవడంతో గ్రిడ్ నిర్వహణ సమస్యగా మారుతున్నది.
కేటీపీఎస్-7లో మరింత దారుణం
కొత్తగూడెంలోని కేటీపీఎస్ స్టేజ్-7లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. సెప్టెంబర్లో అక్కడ పీఎల్ఎఫ్ కేవలం 16.98 శాతానికే పరిమితమైంది. 800 మోగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్ ఇంత తకువ పీఎల్ఎఫ్తో నడవడంపై విద్యుత్తు ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో సాంకేతిక సమస్యలు ఉత్పత్తికి అవరోధంగా మారాయి. యూనిట్-3లో ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ సమస్య, యూనిట్-4లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ సమస్య తలెత్తడంతో సెప్టెంబర్ 9 నుంచి ఈ రెండు యూనిట్లు నిలిచిపోయాయి.
రాష్ట్రంలో మొత్తం థర్మల్ పవర్ ప్లాంట్ల సామర్థ్యం 7,180 మోగావాట్లుగా ఉన్నప్పటికీ ఈ ప్లాంట్ల నుంచి రోజుకు సగటున 100 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే అందుతున్నది. ప్రస్తుతం విద్యుత్తు అధికారులు నడవని ప్లాంట్లను పక్కనపెట్టి నడుస్తున్న ప్లాంట్లల్లో ఉత్పత్తిని పెంచాలని చూస్తున్నారు. ప్లాంట్లవారీగా టార్గెట్లు పెట్టి ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా మూడు, నాలుగు మిలియన్ యూనిట్లకు మించి ఉత్పత్తి పెరుగడంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో రోజువారీ విద్యుత్తు వినియోగం 300 మిలియన్ యూనిట్లు దాటింది. ఇందులో సగానికిపైగా విద్యుత్తును బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు.
జెన్కో నుంచి సరఫరా అయిన విద్యుత్తు
తేదీ : మిలియన్ యూనిట్లు
సెప్టెంబర్ 11 : 104.195
సెప్టెంబర్ 10 : 106.484
సెప్టెంబర్ 09 : 101.685
సెప్టెంబర్ 08 : 87.985
సెప్టెంబర్ 07 : 90.646
సెప్టెంబర్ 06 : 86.77