చండీఘడ్: తాజాగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు జర్నలిస్టులను ముఖ్యంగా మహిళా జర్నలిస్టులను వేధించడాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సోమవారం ఒక ప్రకటనలో ఖండించింది. ఒక ఏసీపీ తనను వేధించారని ఒక మహిళా జర్నలిస్ట్ పార్లమెంట్ వీధి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కొన్ని గంటలపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంపై ఐజేయూ అధ్యక్షులు బల్వీందర్ సింగ్, సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చట్టాల ప్రకారం పాలన సాగే ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదన్నారు. పలువురు పాత్రికేయులు, స్వతంత్ర డిజిటల్ ప్లాట్‌ఫామ్ జర్నలిస్టులు తమ గుర్తింపు కార్డులను చూపినా వేధింపులకు గురయ్యారని ఐజేయూ తెలిపింది. జర్నలిస్టులను వేధించిన ఘటనలో నిందితులైన పోలీసులపై క్రిమినల్, శాఖపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. జర్నలిస్టులపై భౌతిక దాడి, వారిని వేధించడం, చట్ట విరుద్ధంగా నిర్భందించడంపై నిర్దిష్ట కాల పరిమితితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.