Karnataka | ‘కరంట్ వస్తుందా?’. ‘ఇప్పుడైతే వస్తుంది.. ఇది ఎంతకాలం ఉంటుందో తెల్వదు.. అక్కడ (తెలంగాణ) కాకరేగితే ఇక్కడ (కర్ణాటక) కరెంట్ ఇస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు అయిపోతే ఇస్తరో? లేదో? తెలియదు’ అని రాయిచూర్ కాటన్ జన్నింగ్ మిల్లులో సూపర్వైజర్గా పనిచేస్తున్న వినోద్ అనుమానం వ్య క్తంచేశాడు. ఇది ఒక్క వినోద్ అనుమానమే కాదు.. కర్ణాటక ప్రజలందరి మదిలోనూ మె దులుతున్న ప్రశ్న. కర్ణాటక తరహాలో తమను గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ, ‘మా దగ్గర 24 గంటలు ఇస్తుంటే.. 5 గంటలు ఇచ్చే కర్ణాటక పాలకపక్షం నేతలా మమ్మల్ని తప్పుపట్టేది’ అని సీఎం కేసీఆర్ మొదలుకొని ఆ పా ర్టీ ముఖ్య నేతలు నిలదీస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వారం, పది రోజుల నుంచి తమ పట్టణాలు, నగరాల్లో కో తలు లేకుండా విద్యుత్తు సరఫరా చేసేందుకు నానా తంటాలు పడుతున్నది. అయినప్పటికీ రోజుకు నాలుగైదు గంటలపాటు విద్యుత్తు కో తలు విధిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఎన్నికల పుణ్యమా అని ఈపాటి కరెంట్ అయినా వస్తున్నదని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల యజమానులు, కార్మికులు చెప్తున్నారు. ( బళ్లారి, రాయచూర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వెల్జాల చంద్రశేఖర్ )
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు తీవ్ర విద్యుత్తు కోతలను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర తాగు, సాగునీటి కోసం అల్లాడిపోతున్నా రు. చేతికొచ్చిన మెట్ట పంటలను కాపాడటం లో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా యి. కనీసం తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకైనా కొంతలో కొంత మెరుగైన విద్యుత్తు ను సరఫరా చేసి ఈ గండం నుంచి బయట ప డేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తాము అధికారంలోకి వస్తే 24 గంటల విద్యుత్తు, 5 గ్యారెంటీ పథకాలను అందిస్తామ ని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. అయి తే అధికారంలోకి వచ్చాక ఆరు నెలలు తిరక్కుండానే రాష్ట్రం తీవ్ర విద్యుత్తు సంక్షోభంలో పడిపోయింది.
ఇది తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కాకరేపడంతో మసకబారుతున్న తన ప్రతిష్ఠను కాపాడుకునేందుకు కర్ణాటక ప్రభుత్వ అధినేతలు, మంత్రులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు తెలంగాణలో ఎన్నికల కారణంగా అయినా ప్రభుత్వం తమను పట్టించుకుంటుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరు నెలలుగా విద్యుత్తు కోతల ప్రభావం వల్ల దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇందులో ప్రధానంగా వ్యవసాయరంగం కుదేలైంది. చేతికొచ్చిన పంటలు ఎండిపోయి రైతన్నలు విలవిల్లాడుతున్నారు. కొంతకాలంపాటు పరిశ్రమలు పవర్ హాలిడేను ఎదుర్కోవడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెంచిన విద్యుత్తు చార్జీలు పెనుభారంగా మరాయి. విద్యుత్తు కోతల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి తలెత్తింది.
ప్రస్తుతం కొన్ని జిల్లాలకు వ్యవసాయానికి 5 గంటల కరెంటే ఇస్తున్నాం. చెరుకు, వరికోతకు వచ్చినందున ఎక్కువ సమయంపాటు విద్యుత్తు అవసరమని వ్యవసాయ శాఖ సూచించింది. రాబోయే రోజుల్లో 7 గంటల సరఫరా చేస్తాం. ఇతర రాష్ర్టాల నుంచి కొని రైతులకు ఇస్తాం.
-కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
తెలంగాణ ఎన్నికల పుణ్యమా అని ఇక్కడ సక్రమంగా విద్యుత్తు సరఫరా అవుతున్నది. ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. అక్కడ ఎన్నికలు ముగిస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందేమో అనే భయం కలుగుతున్నది. ఇది నా ఒక్కడిదే కాదు.. ఇక్కడ ప్రతి ఒక్కరిలోని అనుమానం.
– వినోద్, సూపర్వైజర్, కాటన్ జిన్నింగ్ మిల్లు, రాయచూర్
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోతలు, చార్జీల పెంపుతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన నెలకే 5వేల మందితో ధర్నా చేయక తప్పలేదు. పెంచిన చార్జీలతో ప్రొడక్షన్ తగ్గింది. ఇది ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఒకవైపు పరిశ్రమలకు సరిపడా విద్యుత్తు సరఫరా చేయకుండా పవర్ హాలిడేస్ ప్రకటించి, మరోవైపు విద్యుత్తు చార్జీలు పెంచితే ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి? రైతన్నలు పంటలను కాపాడుకొనేందుకు నిత్యం ఆందోళనలు చేయాల్సి వస్తున్నది. మైనింగ్, వ్యవసాయరంగం, పరిశ్రమలు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తున్నది. వ్యవసాయరంగాన్ని, రైతులను కాపాడుకోకపోతే మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పది రోజుల నుంచి పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా కాస్త మెరుగైంది.
– చిట్టూరి శ్రీనివాస్‌రావు, గౌరవాధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, బళ్లారి
కర్ణాటకలో కరెంట్ సమస్యతో అష్టకష్టాలు పడుతున్నాం. ఊళ్లల్లో పంటలు ఎండిపోతే బ తకడానికి పట్నం వస్తే ఇక్కడా అదే పరిస్థితి. కరెంట్ లేక మిల్లులు నడుస్తలేవు. రెండు, మూ డు వందలు ఖర్చు చేసి పెట్రోల్ పోసుకొని రాయచూర్‌కు వస్తే కరెంట్ లేక.. మిల్లులు నడవక.. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రింబవుళ్లు పడిగాపులు కాస్తున్నాం. ఈ పరిస్థితిలో పేదోడు బతికేది ఎట్ల? ఒకప్పుడు తెలంగాణలో కరెంట్ లేక పనుల కోసం కర్ణాటకకు వచ్చేది. ఇప్పుడేమో కర్ణాటకలో పనులు లేక తెలంగాణకు వెళ్లాల్సి వస్తుంది.
– మిరుదొడ్డి నాగరాజు, బాయిదొడ్డి బీమేశ్, హమాలీలు, రాయచూర్
బళ్లారిలో జీన్స్ పరిశ్రమరంగంలో 1996 నుంచి ఉన్నా. నా వద్ద ప్రత్యక్షంగా వంద మంది, పరోక్షంగా వంద మందికి ఉపాధి పొందుతున్నారు. మా పరిశ్రమకు దసరా సీజన్ చాలా ముఖ్యం. తీవ్రమైన కరెంట్ సమస్య తలెత్తడంతో గార్మెంట్ రంగం తీవ్రంగా నష్టపోయింది. దీంతో కొనుగోలు చేసిన సరుకులు, వస్ర్తాలను కనీసం దీపావళికైనా అమ్ముకోవడానికి తంటాలు పడుతున్నాం. కరెంట్ కష్టాలతో లక్ష మంది ఉపాధి కోల్పోయారు. ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం స్పందించింది. ఉన్నతాధికారులు చర్చలు జరిపి, సమస్య రాకుండా చూస్తాం.. కానీ సమస్యపై మీడియాకు ఎక్కవద్దని మాట తీసుకున్నారు. ప్రస్తుతం కూడా నాలుగు, ఐదు గంటలపాటు విద్యుత్తు కోతలు ఉన్నప్పటికీ కొంతలో కొంత సమస్య మెరుగుపడింది. జరిగిన నష్టం నుంచి గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాం.
-మల్లికార్జున, పోలెక్స్ జీన్స్ యజమాని, బళ్లారి
రాష్ట్రంలో విద్యుత్తు సమస్య తొలిగిపోలేదు. ఉదయం కరెంట్ తీస్తే సాయంత్రానికి కాని రాదు. దీనివల్ల నా లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి చాలా ఇబ్బందిగా మారింది. ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరెంట్‌తో మా బతుకులు ఆగమైపోతున్నయ్. తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నం.
– మల్లికార్జునప్ప, పాన్ అండ్ జనరల్ స్టోర్ యజమాని, రాయచూర్
విద్యుత్తు చార్జీలు పెంచడం వల్ల కర్ణాటకలో కాటన్ అండ్ జిన్నింగ్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. మొదటి నుంచి హైదరాబాద్ కర్ణాటకపై వివక్ష కొనసాగిస్తున్నాయి. దీనిపై న్యాయపోరాటం చేస్తు న్నాం. కమర్షియల్ విద్యుత్తుకు గతంలో యూనిట్‌కు రూ.7.10 వసూలు చేయ గా, ప్రస్తుతం సర్‌చార్జీలతో రూ.9.10 పడుతున్నది. కమర్షియల్ విద్యుత్తు చార్జీలు పెంచడం వల్ల రాయచూర్‌లోని 65 జిన్మింగ్ మిల్లులు, 90 రైస్ మిల్లులు, 110 బ్రిక్స్ అండ్ ఫ్లై యాష్ పరిశమ్రలు, 10 దాల్‌మిల్లులు, 5 పుట్నాల మిల్లులు నెలకు 78 కోట్ల మేరకు నష్టపోతున్నాయి.
-కే లక్ష్మిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, కర్ణాటక కాటన్ మిల్స్ అసోసియేషన్