హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసు వెబ్సైట్ మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల వెబ్సైట్లను కూడా హ్యాకర్లు వదిలిపెట్టలేదు. ఈ కీలకమైన వెబ్సైట్ సర్వర్లలోకి ఓ ప్రమాదకరమైన మాల్వేర్ (వైరస్)ను హ్యాకర్లు పంపినట్టు సాంకేతిక సిబ్బంది గుర్తించారు. రెండువారాలుగా తెలంగాణ పోలీసు వెబ్సైట్ పనిచేయడం లేదు. ఎప్పుడు ఓపెన్ చేసినా ‘రీలోడ్’ అని వస్తున్నది. ఉన్నతాధికారులు తొలుత దీనిని సాంకేతిక సమస్యగా కొట్టిపారేశారు. కానీ తాజాగా రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల వెబ్సైట్లలో కూడా ‘రీలోడ్’ ఆప్షన్ దర్శనమివ్వడంతో పాటు.. ఒకేసారి బెట్టింగ్, గేమింగ్ సైట్స్‌కు రీడైరెక్ట్ అయ్యాయి. అప్పుడు పోలీసు సాంకేతిక వ్యవస్థపై హ్యాకర్లు దాడి చేస్తున్నారని గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు నాలుగైదు రోజులుగా ప్రయత్నించినా ఫలితం రాలేదు. దీంతో ‘నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్’ (ఎన్ఐసీ)కి సమాచారం ఇచ్చారు.
తెలంగాణ పోలీసు వెబ్‌సైట్‌తోపాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల వెబ్సైట్లను క్లిక్ చేస్తే నేరుగా గేమింగ్ అప్లికేషన్లకు రీడైరెక్ట్ అవుతున్నాయని ఓ అధికారి చెప్పారు. ఈ సమస్య వారం రోజులుగా ఉందని, మొదట దీనిని సాధారణ సాంకేతిక సమస్యగానే భావించామని అన్నారు. తరచూ వెబ్సైట్ మొరాయించడం, క్లిక్ చేసిన వెంటనే గేమింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతుండటంతో హ్యాక్ అయినట్టు గుర్తించామని చెప్పారు. సాంకేతిక సిబ్బంది వెంటనే ప్రమాదాన్ని గుర్తించి.. సర్వర్లను డౌన్ చేశారు. ఆ తర్వాత ఎన్ఐసీకి సమాచారం అందించడంతో వారు ఈ వెబ్సైట్లను పరిశీలించి.. ప్రమాదకరమైన ఓ మాల్వేర్ను గుర్తించారు. వెబ్సైట్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తూ వాటి పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో పోలీసుల సాంకేతిక వ్యవస్థ దేశానికే ఆదర్శవంతంగా నిలిచింది. డార్క్‌వెబ్‌లో సైతం తెలంగాణలో ఏదైనా అక్రమ కార్యకలాపాలు సాగించాలన్నా ‘నో సేల్ ఇన్ తెలంగాణ’ అనే బోర్డులు కనిపించేవి. అట్లాంటి పటిష్టమైన వ్యవస్థ గత రెండేండ్లలో రెండుసార్లు హ్యాకింగ్‌కు గురైంది. ఈ హ్యాకింగ్ వెనుక ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నదని సైబర్ నిపుణులు అంటున్నారు. హ్యాకర్లు ఏడాదికొకసారి తెలంగాణ పోలీసులకు సవాల్ విసురుతూ డాటా మొత్తం దోచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిరుడు జూన్‌లో ఢిల్లీకి చెందిన ఓ యువ హ్యాకర్ తెలంగాణ పోలీసు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి.. అందులోని డాటా మొత్తం చోరీ చేసి, డార్క్‌వెబ్‌లో కేవలం 120-150 డాలర్లకే అమ్మకానికి పెట్టాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసినా డాటా రికవరీ చేయలేకపోయారని ఆరోపణలు వచ్చాయి. మళ్లీ తెలంగాణ పోలీసు వెబ్‌సైట్‌తో పాటు, రాచకొండ, సైబరాబాద్ వెబ్సైట్లను హ్యాక్ చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో సైబర్ నేరాలను అడ్డుకోవడానికి ‘సైబర్ పెట్రోలింగ్’ నిర్వహిస్తున్నామని స్వయంగా డీజీపీ చెప్పినా.. ఆ స్థాయిలో వ్యవస్థ పనిచేయడం లేదని ఈ హ్యాకింగ్ ఘటనతో తేటతెల్లమైంది. నవంబర్ 15న హైకోర్టు వెబ్సైట్ సైతం ఇట్లాగే హ్యాకింగ్‌కు గురైంది. అంతకుముందే.. తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన 22 విభాగాల వెబ్సైట్ల నుంచి డాటాను చోరీ చేసి, దానిని డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. సైబర్ పెట్రోలింగ్ పటిష్ఠంగా లేకపోవడం వల్ల, ఏ హ్యాకర్ మన వెబ్సైట్లు, సర్వర్లపై దాడి చేస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుత పోలీసింగ్ ఆ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ విభాగాల డాటాను ఎవరు అమ్మకానికి పెట్టారో కూడా తెలుసుకోలేకపోయారని సైబర్ సెక్యూరిటీ ఎన్జీవోలు అంటున్నాయి. ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తేనే.. దానిపై విచారణ చేస్తామనే ధోరణిలో ప్రస్తుత యంత్రాంగం పనిచేస్తున్నదని విమర్శిస్తున్నాయి.
పోలీస్ వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయనే వార్తలు గురువారం ఉదయం నుంచి మీడియాలో గుప్పుమనడంతో పోలీసుశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎన్ఐసీ ప్రతినిధుల సహకారంతో సమస్యను తాత్కాలికంగా పరిష్కరించింది. గురువారం సాయంత్రం నుంచి తెలంగాణ పోలీసు, రాచకొండ పోలీసు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల వెబ్సైట్లు యథావిధిగా పనిచేశాయి. దేశంలోనే పవర్ఫుల్ సాంకేతిక వ్యవస్థగా పేరుగాంచిన తెలంగాణ పోలీసుశాఖకు అప్రతిష్ట రావడంతో తాత్కాలిక ఉపశమనం ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. తెలంగాణ పోలీసు వెబ్సైట్ నుంచి ఎఫ్ఐఆర్లను చూసే సేవలు, ఆన్లైన్లో ఫిర్యాదు చేసే సేవలు, పిటిషన్ స్టేటస్, పాస్‌పోర్టు సేవలు, ఈ-చలాన్ సేవలు, సీఈఐఆర్ సేవలు, పోలీసు వెరిఫికేషన్ అండ్ క్లియరెన్స్ వివరాలు, మిస్సింగ్ పర్సన్స్ లిస్టు, రోడ్‌సేఫ్టీ, షీటీమ్స్, ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ వంటి ఎన్నో సిటిజన్ సర్వీసులు మళ్లీ యథాతథంగా అందుబాటులోకి వచ్చాయి.