హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్‌ను దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో హోంశాఖకు వెన్నుదన్నుగా నిలిచిన కేసీఆర్ సంకల్పం వృథాగా పోలేదు. ఇండియా జస్టిస్ రిపోర్టు-2025లో తెలంగాణ పోలీసులు ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. 6.48/10 పాయింట్లతో తెలంగాణ తొలిస్థానం దక్కించుకుంది. కేసీఆర్ వేసిన బాటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నడవడం, పోలీసుశాఖకు నిధులు మంజూరు చేయడంతో అక్కడక్కడ మినహా.. పోలీసుల పనితీరు మెరుగుపడటంతో మళ్లీ తొలిస్థానంలో కొనసాగింది.
ఇండియా జస్టిస్ 2022లో విడుదల చేసిన రిపోర్టులోనూ తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఐదేండ్లలో వరుసగా రెండుసార్లు తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రంగా తెలంగాణ కీర్తి గడించింది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు వరుసగా నిలిచాయి. చివరిస్థానంలో వెస్ట్‌బెంగాల్ ఉంది. 2020-21లో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధికంగా పోలీసుల ట్రైనింగ్ కోసం బడ్జెట్లో 193.5 కోట్లు కేటాయించిందని రిపోర్టు గుర్తుచేసింది. అలాగే 2021-22లో 68 కోట్లను కేటాయించింది.
ఇండియా జస్టిస్ రిపోర్టు ప్రకారం.. జైళ్ల సంక్షేమంలో తెలంగాణ 7వ స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ హయాంలో జైళ్లశాఖ పనితీరు దారుణంగా తగ్గింది. 2020 రిపోర్టులో తెలంగాణ 2వ స్థానంలో.. 2022లో 3వ స్థానంలో కొనసాగగా.. ఏడాదిన్నరకే 7వ స్థానానికి పడిపోయింది. జైళ్లశాఖ సంక్షేమం, పనితీరులో మొదటిస్థానంలో తమిళనాడు ఉండగా.. ఐదో స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచింది. ఇక ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లు అధ్వాన పనితీరుతో చివరి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం.. లీగల్ ఎయిడ్ సర్వీసెస్‌లో తెలంగాణ ర్యాంకింగ్ దారుణంగా పడిపోయింది. 2019లో 4వ స్థానంలో, 2020లో 6వ స్థానంలో, 2022లో 5వ స్థానంలో ఉండగా.. 2025లో 10వ స్థానానికి దిగజారింది. లీగల్ ఎయిడ్ సర్వీసెస్‌లో కర్ణాటక, పంజాబ్, హర్యాన, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ విభాగంలో.. తెలంగాణ 17వ స్థానానికి పరిమితమైంది. కాగా, జ్యుడీషియరీలో రెండో స్థానంలో నిలిచింది.