సుబేదారి, నవంబర్ 18: యూట్యూబ్‌లో చూసి.. 2 వేల రూపాయల నకిలీ నోట్లు తయారుచేసి, రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.6 లక్షల నకిలీ నోట్లు, ప్రింట ర్, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ తరుణ్‌జోషి నిందితుల వివరాలు వెల్లడించారు. రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించే సమయంలో హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన సయ్యద్ యాకూబ్ అలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), కాజీపేట చింతల్‌బస్తీకి చెందిన గడ్డం ప్రవీణ్, గుండ్ల రజినీకి పరిచయం ఏర్పడింది.
వీరు న్యూరాయపురకు చెందిన ఎండీ షమీర్, పెద్దమ్మగడ్డకు చెందిన పేరాల అవినాశ్, నర్సంపేట రాజీవ్‌నగర్‌కు చెందిన కత్తి రమేశ్, హనుమకొండ మచిలీబజార్‌కు చెందిన ఎండీ అక్రం అలీ, కాజీపేట చింతల్ బస్తీకి చెందిన కత్తి సునీత, కాపువాడకు చెందిన సోహెల్‌తో ముఠాగా ఏర్పడి యూట్యూబ్‌లో నకిలీ రెండు వేల నోట్ల తయారీ గురించి తెలుసుకున్నారు. ఒరిజినల్ రూ.2 వేల నోటును పోలి ఉండే కాగితాలను కొనుగోలు చేసి, నకిలీ నోట్లు ముద్రించేవారు. అనుమానం రాకుండా ముఠా సభ్యులు నకిలీ నోట్లను రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేసేవారు. ప్రధాన నిందితుడు యాకూబ్, మరో నిందితుడు అవినాశ్ దొంగనోట్లను చెలామణి చేసేందుకు బైక్‌పై సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని తిరుమల బార్ వద్దకు రాగానే పక్కా సమాచారంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్టు చేయగా సమీర్ పరారీలో ఉన్నాడు.