హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని, మనిషికి పని కల్పించలేని అమానవీయ అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నదని తెలంగాణ పీపుల్స్ జేఏసీ విమర్శించింది. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రేవంత్ పాలన కొనసాగుతున్నదని, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించింది. రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలుకాలేదని, రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది. కాంగ్రెస్ రెండేండ్ల పాలనపై తెలంగాణ పౌర సమాజం ప్రతిస్పందన పేరుతో తెలంగాణ పీపుల్స్ జేఏసీ.. పలువురు రచయితల వ్యాసాలతో కూడిన సంకలనాన్ని విడుదల చేసింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, పేర్కొన్నది.
రాహుల్‌గాంధీ నిత్యం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను, వికసిత్ భారత్ కార్యక్రమాన్ని విమర్శిస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ రైజింగ్-2047 పేరుతో బీజేపీ అడుగుజాడల్లో పయనిస్తూ బడాబాబులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదని దుయ్యబట్టింది. ప్రభుత్వ పనితీరు పూర్తి నిరాశాజనకంగా ఉన్నదని, ఇది ప్రజాపాలన ఎంతమాత్రం కాదని, పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం సర్వనాశనం అవడం ఖాయమని ఆందోళన వ్యక్తంచేసింది. తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో సాధారణ ప్రజలకు చోటులేకుండా పోయిందని పేర్కొన్నది. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన, సచివాలయం వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు, ప్రభుత్వ చిహ్నాల మార్పు వంటి చర్యలు తెలంగాణ సమాజానికి తీవ్ర మనస్తాపం కలిగించాయని వివరించింది.