Congress | దేశానికి స్వతంత్రం తెచ్చిందే మేము. భూమి పుట్టినప్పటి నుంచి పరిపాలన మాకు తెలుసు… అని చెప్పుకుంటూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మ్యానిఫెస్టోలు తయారు చేసేటప్పుడు మాత్రం నిన్న మొన్న పెట్టిన పార్టీల కన్నా అధ్వానంగా ఆలోచిస్తుంది. వాటి అమలు సాధ్యాసాధ్యాల సంగతి ఆ పార్టీకి పట్టదు. మొన్నటికి మొన్న కర్ణాటకలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అలవికాని హామీలెన్నో ఇచ్చింది. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించింది. తీరా అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవకముందే ‘మేమిచ్చిన ఐదు హామీలు నెరవేర్చితే ఖజానా ఖాళీ అయిపోతుంది. ప్రభుత్వాన్ని నడపలేం’ అని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రే చేతులెత్తేశారు.
వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్తు ఇస్తామన్న వాళ్లు అప్పుడే అయిదు గంటలంటూ ప్లేటు ఫిరాయించారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణానికి కొత్తగా షరతులు వర్తిస్తాయంటున్నారు. ఇదే పార్టీ ఏలుబడిలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఏకంగా పది హామీలు ఇచ్చింది. పీఠమెక్కి ఏడాది గడిచినా ఒక్కదాన్నీ అమలు చేయలేదు. తాము ఇచ్చే హామీలు నెరవేర్చడం ఏ రకంగానూ వీలుపడదని పదేపదే ఆ పార్టీకి అనుభవం అవుతున్నా… మళ్లీ తెలంగాణ ఎన్నికల్లో గ్యారంటీల వర్షం కురిపిస్తున్నది. ఒక్క చాన్స్ ఇస్తే ఇవన్నీ నెరవేరుస్తామని నమ్మబలుకు తున్నది. దింపుడు కల్లం ఆశ మీదున్న హస్తం పార్టీ అధికారం కోసం ఇలా ఆపద మొక్కులు ప్రకటిస్తున్నది. ఈ పద్ధతిని ఏమనాలి. మన కేసీఆర్ సార్ చెప్పినట్టు ‘మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటరు దీన్ని’ అని కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.