రాజీవ్‌యువ వికాసం (ఆర్‌వైవీ) పథకం తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా మారింది. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందిస్తామంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు 70 శాతం మంది యువతకు మొండి చెయ్యి చూపింది. దరఖాస్తుదారుల్లో మొత్తంగా 30 శాతం మందికే రుణాలు మంజూరు చేయనున్నది. అది కూడా ఎమ్మెల్యేలు చెప్పినవారికే ఇవ్వనున్నది. పథకాన్ని మొత్తంగా ఐదు దశల్లో అమలు చేయాలని, తొలుత రూ.50 వేల యూనిట్లు, చిట్టచివరన రూ.4 లక్షల యూనిట్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. జూన్ 2నే రాష్ట్రవ్యాప్తంగా యువతకు యువవికాసం ప్రొసీడింగ్స్ అందిస్తామంటూ రెండు నెలలుగా ఊదరగొట్టినా అదీ ఆచరణలో అటకెక్కింది. మరోవైపు సర్కారు సాయం కోసం 16.23లక్షల మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నది.
Rajeev Yuva Vikasam | హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ) : రాజీవ్ యువవికాసం పథకం కింద యువతకు సబ్సిడీ రుణాలను ఇస్తామని ప్రభుత్వం ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. పథకం కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. ప్రతి నియోజకవర్గంలో 5000 మంది యువతకు జూన్ 2 నుంచి 9 వరకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 16,23,643 మంది పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం అందులో మొత్తంగా 4,93,234 లక్షల మందికే (30.37శాతం) రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది కేవలం ఆర్‌వైవీ పథకానికి సంబంధించినవే కాగా గతంలో బీసీ బంధు, మైనార్టీ బంధు, ట్రైకార్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు మరో 10 లక్షల మంది ఉన్నారు. వారికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించకపోవడం గమనార్హం. ప్రభుత్వం తీరుతో ఆర్‌వైవీ సబ్సిడీ రుణం అందని ద్రాక్షగానే మిగలనున్నది.
ప్రస్తుతం ఆర్‌వైవీ పథకం కింద ఇచ్చేదే అంతంతమాత్రం కాగా అదీ కాంగ్రెస్ కార్యకర్తలకే అన్నచందంగా మారింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే బాహాటంగా ప్రకటించారు. ‘కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలకు అంకితమిస్తూ నిధులను ఉపయోగిస్తాం… పార్టీ కార్యకర్తలకు మాత్రమే కాదు, వారి కుటుంబాలకు కూడా ఆర్థిక భద్రత ఇవ్వడం మా ప్రాధాన్యం. వెంట తిరిగిన కార్యకర్తలకు ఏదైనా చేయాలని అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కూడా నన్ను కోరారు. అందుకే కార్యకర్తలకు స్వయం ఉపాధి పథకం కింద రూ.4 లక్షల వరకు అందిస్తాం. 2 నెలల్లో ఈ డబ్బులు పంపిణీ చేస్తాం. అర్హులైన కార్యకర్తలకు అందించే బాధ్యత ఎమ్మెల్యేలదే’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగానే పథకం మార్గదర్శకాలు రూపొందించారు. అంతిమంగా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలనే నిబంధనను చేర్చడమే అందుకు నిదర్శనం. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పథకాన్ని కార్యకర్తలకే అమలు చేస్తున్నట్టుగా ఉన్నదని యువత మండిపడుతున్నది..
ఆర్‌వైవీ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం రెండు నెలల ముందుగానే జారీ చేసింది. తొలుత ఏప్రిల్ 5లోగా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినా ఆ గడువును 14 వరకు పొడగించింది. ప్రభుత్వ మార్గదర్శకాలు, జనాభా దామాషా, క్యాటగిరీల వారీగా మంజూరైన యూనిట్ల మేరకు మే 20లోగా అర్హులను మండలస్థాయి కమిటీ ఎంపిక చేయాలి. ఆ జాబితాను జిల్లా కమిటీలకు పంపాలి. జిల్లా కమిటీలు 31లోగా తుది జాబితాను సిద్ధం చేసి, ఇన్చార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారులను ప్రకటించాలి. జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని సర్కారు ప్రకటించింది.
కానీ ఇప్పటికీ అర్హుల జాబితాను ఎక్కడా ప్రకటించలేదు. అదీగాక నిన్నమొన్నటి వరకు ప్రొసీడింగ్ ఆర్డర్స్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన ప్రభుత్వం తాజాగా ఆ ప్రక్రియను అంతా పక్కన పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తున్నది. అందుకు ప్రధానకారణంగా లబ్ధిదారుల ఎంపికలో స్థానిక కాంగ్రెస్ నేతల జోక్యం, ఒత్తిడేనని తెలుస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం లీడ్ బ్యాంకులకు పంపాల్సి ఉన్నది. బ్యాంకులు లబ్ధిదారుల సిబిల్ స్కోర్‌ను పరిశీలించి సంతృప్తి చెందితేనే రుణాల మంజూరుకు మొగ్గుచూపుతున్నాయి. లీడ్ బ్యాంకుల పరిశీలన పూర్తయితేగానీ రుణాల మంజూరు ప్రక్రియ ముందుకుసాగని పరిస్థితి! ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 55 శాతం దరఖాస్తుల వరకే బ్యాంకు వెరిఫికేషన్ పూర్తయింది.
ప్రభుత్వం మొత్తంగా రూ.6 వేల కోట్ల సబ్సిడీ రుణ మొత్తాన్ని 5 రకాల యూనిట్లుగా విభజించింది.రూ.50 వేల యూనిట్లను మాత్రమే 100 శాతం సబ్సిడీతో అందిస్తున్నది. రూ.లక్ష యూనిట్లో రూ.90 వేలు ప్రభుత్వం, 10 వేలను రుణంగా, రూ.2 లక్షల యూనిట్లో రూ.1.6 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.40 వేలు బ్యాంకు రుణంగా, రూ.3లక్షల యూనిట్లో రూ.2.1 లక్షలు ప్రభుత్వం, మిగతా రూ.90 వేలు బ్యాంకు రుణంగా, రూ.4 లక్షల యూనిట్లో రూ.2.8 లక్షలు ప్రభుత్వం, మిగతా రూ.1.2 లక్షలు బ్యాంకు రుణంగా అందివ్వాలని నిర్ణయించింది. వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 75 శాతానికి పైగా 4 లక్షల యూనిట్ల కోసమేనని అధికారులు వివరిస్తున్నారు.
ప్రస్తుతం 2 లక్షల నుంచి 4 లక్షల రుణాలకు సంబంధించి ప్రభుత్వం కేవలం 3లక్షల యూనిట్లను మాత్రమే మంజూరు చేసింది. వాటికే దాదాపు 4500 కోట్లు వెచ్చించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో యూనిట్లలో కోత విధించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. రూ.50 వేల నుంచి లక్ష యూనిట్లకే ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ఎక్కువ మందికి ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకునే అవకాశమూ ఉంటుందని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. అందుకు అనుగుణంగా తాజాగా అధికారులకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. యూనిట్లను మార్పు చేసేందుకు ఎంపీడీవోలకు అవకాశం కల్పించింది. ఎంపీడీవో లాగిన్ నుంచి యూనిట్లను మార్పు చేయవచ్చని తెలిపింది. మొత్తంగా 4 లక్షల యూనిట్లలో కోత తప్పదని అధికారులు సైతం వెల్లడిస్తున్నారు.
రాజీవ్ యువవికాసం పథకం కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు : 16,23,643
ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తయినవి : 15,53,551 (95.68%)
అర్హుల ఎంపికకు బ్యాంకులకు పంపిన దరఖాస్తులు : 13,83,950 (85.24%)
బ్యాంకులు ఇప్పటివరకు పరిశీలించినవి : 8,93,219 (55.01%)