హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మ్యాచ్… కాంగ్రెస్ (Congress) నేతల కుటుంబ వ్యవహారంగా సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. శనివారం ఉప్పల్ స్టేడియంలో ప్రజాధనంతో మ్యాచ్ ఏర్పాటు చేయడం, కాంగ్రెస్ నేతల పిల్లలే సందడి చేయడం ప్రజలు, క్రీడా, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ ఆద్యంతం కాంగ్రెస్ కార్యక్రమంగా సాగడమే ఇందు కు కారణంగా నిలుస్తున్నది. మ్యాచ్‌లో కనిపించిన ఆటగాళ్లు ఎవరు అని పరిశీలిస్తే ఒకరు సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి కొడుకు నయన్రెడ్డి, మిగిలిన వాళ్లలో రామగుండం ఎమ్మెల్యే కొడుకు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాగూర్ కొడుకు, రేవంత్‌రెడ్డి సొంత, ఆంతరంగిక వ్యవహారాలు చక్కబెట్టే రోహిణ్‌రెడ్డి కొడుకు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ కొడుకు ఉన్నారు.
ఇక సీఎం చంకనెత్తుకుని వెళ్లిన మనుమడు ఎలాగో ఉండనే ఉన్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కలిసి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంగా సాగింది తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని రాజకీయవర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల పిల్లలే కాకుండా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కొడుకు, కూతురు గ్రౌండ్లో రాహుల్ గాంధీతో కలిసి మెస్సీ మ్యాచ్‌ను వీక్షించారు.
మెస్సీ మ్యాచ్ చారిటీ మ్యాచ్ అని, ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్నదని సీఎం చెప్పుకొచ్చారు. కానీ రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజాధనం వెచ్చించిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. గ్రౌండ్లో 10 నిమిషా ల షో కోసం రూ.100 కోట్లు ఖర్చు పెట్ట డం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెస్సీ క్యాజువల్ డ్రెస్‌తో గ్రౌండ్లోకి వస్తే రేవంత్ మాత్రం అంతర్జాతీయ స్థాయి తరహా గెటప్‌తో రావడం విడ్డూరమని, సీఎంగా ఉండి గెటప్‌లు వేసుకోవడమేంటని మండిపడుతున్నారు.
రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి గ్రౌండ్లో హడావుడి చేయగా, కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యు లు మనదే ఇదంతా అన్నట్టుగా వ్యవహరించారని ఎద్దేవా చేస్తున్నారు. మెస్సీతో మనుమడిని కూడా మ్యాచ్ ఆడించడం ద్వారా రేవంత్ సరదా తీర్చుకున్నారని పెదవి విరుస్తున్నారు. ఎవరి సొమ్ము, ఎవ రి కోసం ఖర్చు చేశారని మండిపడుతున్నా రు. పాలకులు, అనుయాయుల సరదాల కోసం ప్రజల సొమ్మును పప్పుబెల్లాల్లా పంచి పెడుతారా అని ప్రశ్నిస్తున్నారు.