Telangana | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజానీకం( Telangana People ) భగ్గుమంది. తెలంగాణకు నయాపైసా ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. 35 నిమిషాల ప్రసంగంలో 30 సార్లు రాష్ట్ర సర్కార్ పేరెత్తిన మోదీ.. కొత్తగా ఏమీ ఇవ్వకుండా, పాత ప్రకటనలకే బటన్లు నొక్కారని విమర్శించారు. సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలు ద్వారా ఆంధ్రా – తెలంగాణను ఎంతో ఉద్ధరిస్తున్నట్లు మోదీ బిల్డప్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ పాలన బీజేపీ ఇంట్లో పెట్టుకుని మోదీ నీతులు మాట్లాడటంపై ధ్వజమెత్తారు. మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఎవరో మోదీకి తెలియదా? పీయూష్ గోయల్ ఎవరు..? సింధియా ఎవరో.. అనురాగ్ ఠాకూర్ ఎవరో తెలియదా..? రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే అయిన సంగతి మోదీ మరిచిపోయారా..? అమిత్ షా కొడుకు బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన సంగతి పక్కన పెట్టారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు కుటుంబ పాలన గురించి మోదీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు ఇవ్వకుండా.. పేపర్ లీక్ చేసేందుకు సహకరించిన వాళ్ల భుజాలను మోదీ తట్టారు. కొత్త రైల్వే లైన్లపై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలపై మోదీ సమాధానం చెప్పలేదు. సింగరేణి ప్రయివేటీకరణపై మారుమాట్లాడలేదు. కార్మికులు ఎందుకు నిరసన తెలుపుతున్నారో తెలుసుకోలేని స్థితిలో ప్రధాని ఉన్నారు. తెలంగాణను విచ్చిన్న చేసే కుట్రలకు కాషాయదళం పదును పెట్టింది. తెలంగాణను తామే ఉద్దరిస్తున్నట్లు మోదీ భుజాలు తడుముకున్నాడు. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోదీకి వంతపాడారు. తెలంగాణ గ్రామాలకు అవార్డులిచ్చి, అవాకులు చెవాకులు పేలుతారా..? ప్రధాని హోదాలో హుందాగా నాలుగు మంచి మాటలు మాట్లాడలేరా..? అని తెలంగాణ ప్రజలు నిలదీశారు.