ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలి
ప్రతి మూడు నెలలకు ‘ఉత్తమ’ వైద్య సిబ్బంది, అధికారులకు ఘన సన్మానం
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 3 : ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆ శాఖ అధికారులు, సిబ్బందికి సూచించారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో ప్రస్తుతం తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని, మొదటి స్థానానికి చేర్చేందుకు ప్రతి ఒకరూ పోటీతత్వంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆశాలు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, డీఎంహెచ్వోలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని చెప్పారు. సమన్వయంతో పనిచేయటం వల్లే మాతృ మరణాల తగ్గింపు సూచీలో తమిళనాడును అధిగమించి తెలంగాణ రెండో స్థానానికి చేరుకొన్నదని వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి అన్ని సూచీల్లో రాష్ర్టాన్ని నంబర్ వన్‌కు చేర్చాలని సూచించారు.
మలేరియాలో ‘0’ క్యాటగిరీకి చేరాలి
ప్రభుత్వం ప్రారంభించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల సీజనల్ వ్యాధులు చాలా తగ్గాయని మంత్రి పేర్కొన్నారు. మలేరియా విభాగంలో రాష్ట్రం క్యాటగిరీ-2 నుంచి క్యాటగిరీ-1కి చేరిందని, అది క్యాటగిరీ-0 కు చేరుకొనేలా కృషిచేయాలని సూచించారు. బస్తీ దవాఖానల పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, స్టేట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
7న ‘ఉత్తములకు’ సన్మానం
మంచి పనితీరు కనబర్చిన డీఎంహెచ్వోలు, పీహెచ్సీ వైద్యులు, ఆశాలు, ఏఎన్ఎంలకు ఈ నెల 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నగదు ప్రోత్సాహంతో సన్మానిస్తామని మంత్రి వెల్లడించారు. ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి ప్రతి విభాగంలో ముగ్గురిని ఎంపికచేస్తామని చెప్పారు. అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ కాన్పులను ప్రోత్సహించాలని సూచించారు.