కేంద్రం వడ్లు కొననంటున్నది.. రైతన్నా.. జరభద్రం. ఆచితూచి వడ్లు అలుకుడు చెయ్.. ప్రభుత్వం చెప్పినట్టు వరి సాగు బందుపెట్టి.. ఇతర పంటలు సాగుచేస్తే అన్ని రకాలుగా మంచిది. వరి పంటనే సాగుచేస్తే.. తీరా పంట చేతికొచ్చాక అమ్ముడుపోకపోతే ఆర్నెల్ల కష్టం, పెట్టుబడి నష్టం తప్పదు. రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, ప్రమాదాలను ఎదుర్కోవడం ఖాయం.
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కరాఖండిగా చెప్పేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఎంత బతిమిలాడినా ససేమిరా అన్నది. మన విన్నపాలన్నింటినీ చెత్తబుట్టలో పడేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల సంక్షేమం కోసం పరితపించే రాష్ట్ర ప్రభుత్వం.. రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈ యాసంగిలో వరి సాగు వద్దని సూచించింది. అయినప్పటికీ వరిసాగుకు సిద్ధమవుతున్న రైతులు ఎలాంటి కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుందన్న కఠిన వాస్తవాలను వ్యవసాయశాఖ అధికారులు, నిపుణులు తెలియజేస్తున్నారు.
యాసంగిలో వరి సాగుచేసే రైతులు ఇబ్బందులపాలయ్యే పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు యాసంగిలో వడ్లు కొనుగోలు చేయొద్దంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నది. ఈ క్రమంలో వరిసాగును నియంత్రించే ఉద్దేశంతో వరి రైతులకు రైతుబంధు ఇవ్వొద్దని, ఇతర పంటలు సాగు చేసేవారికి మాత్రమే పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఒకవేళ ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తే.. వరి రైతులకు రైతుబంధు నిలిచిపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే.. పెట్టుబడి వ్యయ భారం మొత్తం రైతులపైనే పడుతుంది. ఈ భారం మోయడం చిన్న, సన్నకారు రైతులకు కష్టమైన పనే. పెట్టుబడి కోసం వరి రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంటుంది. గత ఏడు సీజన్లుగా ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇస్తున్న పెట్టుబడి సాయం చిన్న రైతులకు ఎంతో ఆసరాగా ఉంటున్నది. రైతులకు అప్పుల బాధ తొలగించడానికి, పెట్టుబడి ఇబ్బందులు లేకుండా చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రైతుబంధును నిలిపివేస్తే ఒక్కో రైతు కుటుంబం రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోతుంది. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా రైతులకు ప్రతి ఏటా రూ.15 వేల కోట్లు పెట్టుబడి సాయంగా అందిస్తున్న విషయం తెలిసిందే. రైతుబంధు కారణంగా ఇప్పుడిప్పుడే అప్పుల ఊబిలోనుంచి బయటపడుతున్న తరుణంలో మళ్లీ ఇక్కట్లపాలయ్యే అవకాశమున్నదని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఒక ఎకరం వరిసాగుకు రూ.22 వేల పెట్టుబడి వ్యయం అవుతుంది. సగటున ఒక రైతు మూడెకరాల్లో వరి సాగుచేస్తే రూ.66 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చవుతుంది. ఇంత ఖర్చు పెట్టి పండించిన పంటను అమ్ముకొనే పరిస్థితి లేకపోతే ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రభుత్వం చెప్పిన మాట వినకుండా వరి సాగుచేసి.. ఇన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవసరమా! అనే దిశగా రైతులు ఆలోచన చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
వాస్తవానికి ధాన్యం కొనుగోలు కేంద్రమే చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతుల దగ్గరినుంచి సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. ఇప్పుడు కేంద్రం యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని పూర్తిగా చేతులెత్తేసింది. యాసంగిలో మన దగ్గర పండేదే బాయిల్డ్ రైస్. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు మార్గాంతరం లేకుండాపోయింది. గత యాసంగి మాదిరిగానే ఇప్పుడు కూడా భారీ దిగుబడి వస్తే సరాసరిన కోటి టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. ఇంత భారీ మొత్తంలో ధాన్యం కొని.. వాటిని నిల్వ చేసే సామర్థ్యం కానీ, పంపిణీ చేసే వ్యవస్థ కానీ, ఎగుమతులు చేసే అధికారం కానీ మన రాష్ర్టానికే కాదు.. ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికీ లేవు. రాష్ట్రం ఏకపక్షంగా ధాన్యం కొని వాటిని ఏం చేసుకొంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కేంద్రం కొననప్పుడు ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్టేందుకు ఆస్కారం లేదు. కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతుకు కేంద్రం నిర్ణయించే మద్దతు ధర లభించదు. అదే జరిగితే ధాన్యాన్ని అమ్ముకోవడం కష్టమవుతుంది. పోనీ విడిగా అమ్ముకొందామని అనుకొన్నా.. రైతు తానే ఉంచుకోవాలని అనుకొన్నా.. దొడ్డు బియ్యం తినడం మనం ఎప్పుడో మానేశాం. సన్నాలుగా మరాడిస్తే.. క్వింటాలుకు సగం కూడా బియ్యం రావు. ఈ పరిణామం రైతులకు దిక్కుతోచని పరిస్థితి కల్పిస్తుంది. బయట వ్యాపారులకో.. మిల్లర్లకో అడ్డికి పావుశేరు చొప్పున తెగనమ్ముకోవాల్సి వస్తుంది.
కొనుగోలు కేంద్రాలు లేక, ధాన్యం అమ్ముడు పోక రైతులు దిగాలుపడి ఉంటే.. దాన్ని రాజకీయంగా వాడుకోవటానికే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ చూస్తాయి తప్ప.. పైసా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులతో రోడ్లపై ధాన్యాన్ని పోయించి.. ధర్నాలకు దిగి ఫొటోలు తీసుకుని వెళ్లిపోతాయని, కా నీ.. అంతిమంగా ఆ ధాన్యాన్ని ఏం చేసుకోవాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడేది రైతేనని అంటున్నారు.అలా చేస్తే.. రైతుబంధు.. ఎక్కువ లాభం వరి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఇతర పంటలను సాగుచేయడం వల్ల రైతులు అన్ని రకాలుగా లాభం పొందే అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర పంటలు సాగు చేసే రైతులకు ఠంచనుగా రైతుబంధు పెట్టుబడి సాయం అందడమే కాకుండా, పండించిన పంట హాట్‌కేక్‌లా మద్దతు ధరకు (డిమాండ్ ఉంటే ఇంకా ఎక్కువకు కూడా) అమ్ముడు పోతుంది. లాభాలూ దక్కుతాయి.
ప్రభుత్వం వద్దన్నది కదా ఎందుకు సాగుచేస్తున్నారని అడిగితే ‘సీఎం కేసీఆర్ సారు ఇప్పుడు వరి వద్దని అట్లే అంటడు.. కానీ కోతలైనంక మళ్లీ ఆయనే కొంటడు.. అందుకే వేస్తున్నం’ అని కొందరు రైతులు ఆశగా చెప్తున్నారు. ఇలాంటి ఆలోచన, ఆశతో ఉన్న రైతులు వెంటనే వాటిని విరమించుకోవాలని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ధాన్యం కొనే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు. నిజానికి గత రెండేండ్లుగా వరి సాగు వద్దని కేంద్రం రాష్ట్రంపై ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. రైతుల ప్రయోజనాల దృష్ట్యా సీఎం కేసీఆర్ దాటవేస్తూ వచ్చారు. ప్రతి సీజన్లో రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లు నష్టమొచ్చినప్పటికీ ధాన్యం కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్ని రాష్ర్టాలు తప్పుకొన్నా.. కేసీఆర్ మాత్రం ధాన్యం కొనుగోళ్లను ఆపనే లేదు. పైగా రైతుల ఆరోగ్యాన్ని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ కమిటీలు తెరవకుంటే.. ఊరూరా కాంటాలు పెట్టి ధాన్యం కొన్నారు. ఇందుకోసం ఎంత నష్టం వచ్చినా భరించారు. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తున్నది. ప్రభుత్వ సూచనలను తోసిరాజని ఎవరైనా వరి పండించుకొంటే.. ఆ బాధ్యత పూర్తిగా రైతులదేనని చెప్తన్నది. ఒకవేళ మిల్లర్లతో ముందస్తు ఒప్పందం చేసుకొన్న వారు, మిల్లర్లు కొనుగోలు చేస్తారన్న భరోసా ఉన్నవారు వరి సాగు చేసుకోవచ్చని, తర్వాత ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వాన్ని నిందించొద్దని తేల్చి చెప్తున్నారు.