హైదరాబాద్ : భారత యూనియన్‌లో తెలంగాణ విలీనమైన 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం ఇచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ ప్రజాస్వామిక పాలనలోకి ప్రవేశించిన నేపథ్యంలో సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా గత మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెల 16 నుంచి 18 వరకు తెలంగాణ జాతీయ సమైక్యతా విజయోత్సవాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
తెలంగాణ ప్రజల పోరాటపటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఘనంగా చాటేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా శుక్రవారం (రేపు) ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థులు, యువతీ యువకులతో ర్యాలీలు తీయనున్నారు.
17న హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సెంట్రల్ లాన్స్‌లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. అలాగే ప్రధాన కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరుగనున్నది. అలాగే బంజారాహిల్స్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఊరేగింపుగా చేరుకొని.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.