US-Iran Strikes | అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో(US-Iran Strikes) పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారింది. హొర్ముజ్ జలసంధిలో(Strait of Hormuz) వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు జరిపింది. ఇందుకు ప్రతిగా బహ్రెయిన్, కువైట్‌పై ఇరాన్ దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా బహ్రెయిన్, కువైట్ దేశాలు క్షిపణి, డ్రోన్ హెచ్చరికలు జారీ చేశాయి. సైరన్లను మోగించి, సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని, పౌరులను ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని ఆయా దేశాల్లోని ప్రజలకు ప్రభుత్వాలు సూచించాయి. అలాగే యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలు కూడా తమ భద్రతను మరింత కట్టదిట్టం చేశాయి.
మరోవైపు ఇరాన్ అమెరికాకు దీటుగా బదులిచ్చింది. ఈ ప్రాంతం చిన్న దేశాల రాజకీయ జూదానికి చోటు కాదు అని ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ సలహాదారుడు అలీ అక్బర్ వెలాయతి హెచ్చరిం చారు. అమెరికా రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా ప్రతిఘటన కూటమి వేలు తుపాకీ ట్రిగ్గర్పైన ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతం చిన్న దేశాల రాజకీయ జూదానికి తగిన ప్రదేశం కాదని మేము గతంలోనే హెచ్చరించాము. అలాగే ఇటువంటి సాహసోపేత చర్యలకు తక్షణమే ప్రతిస్పందన ఉంటుందని మేము పదేపదే నిరూపించాము అని వరుస ఎక్స్ పోస్ట్‌లలో వెలాయతి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) రద్దు చేయడం అనేది ప్రాంతాన్ని మరోసారి అగ్నిగుండంగా మార్చే ఒక మౌఖిక ఆదేశంగా ఆయన అభివర్ణించారు.