Collector Sandeep Kumar Jha | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో నిరుడు అగస్టు 2న అనారోగ్యంతో మంచంపై ఉన్న వృద్ధురాలు పిట్ట రామలక్ష్మిని వీధికుక్కలు చంపగా, ఈ ఘటనపై న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్చార్సీ విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక సమర్పించాలని 2024లోనే కలెక్టర్‌ను కోరింది.
ఎన్‌హెచ్చార్సీ ఆదేశాలను కలెక్టర్ పాటించకపోగా అసమగ్ర నివేదిక పంపినట్టు కమిషన్ గుర్తించింది. కలెక్టర్ ఇచ్చిన నివేదిక నిర్లక్ష్యంతో కూడుకొని ఉన్నదని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చెప్పినా సరైన విధంగా స్పందించలేదని, ఇలాగైతే తమ అధికారాలను ఉపయోగించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అత్యంత అమానవీయ ఘటనపై జిల్లా ప్రభుత్వ యంత్రాంగం స్పందనలో లోపం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేసింది.
కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాల ప్రస్తావనే లేదని మండిపడింది. జూన్ 12లోగా తగిన వివరాలతో సమగ్ర నివేదిక పంపాలని మరోసారి ఆదేశించింది. లేదంటే మానవహక్కుల రక్షణకు సంబంధించి 1993 చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.