హైదరాబాద్, ఫిబ్రవరి 9 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిన కులగణన సర్వేకు వ్యతిరేకంగా త్వరలో 10 లక్షల మందితో హైదరాబాద్‌లో ‘మున్నూరుకాపు కదనభేరి’ని నిర్వహిస్తామని అపెక్స్‌కౌన్సిల్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూకాపులను ఉద్దేశపూర్వకంగా తక్కువచేసి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగలి దున్ని పంట పండించడమే కాదు, తమను అణచివేస్తే ‘ఇరువాలు.. మూడుసాళ్లు’ దున్నేస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్ సర్కార్ చేసిన కులగణన సర్వేలో తమ సంఖ్యను తకువ చేసి చూపడాన్ని మున్నూరుకాపులు తీవ్రంగా ఖండించారు. జనాభాలో అత్యధికులుగా ఉన్న తమను తకువగా చూపి ప్రభుత్వం అవమానించిందని, మున్నూరుకాపుల ఆత్మగౌరవాన్ని అగౌరవపరచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలను వెల్లడించారు. కులగణన బోగస్ సర్వేను నిరసిస్తూ జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టి కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.
అలాగే, ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగులబెడతామని, ఎమ్మెల్యేలను కలిసి కులగణన రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. మున్నూరుకాపు అపెక్స్ కౌన్సిల్ పిలుపు మేరకు ‘కులగణన ఫలితాలు- జరిగిన తప్పిదాలు’ అనే అంశంపై ఆదివారం సికింద్రాబాద్ సిక్ విలేజ్ వీహెచ్‌ఆర్ హాల్లో అత్యవసర సమావేశం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమరావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితరలు రాష్ట్ర ప్రభుత్వం తప్పులతడకగా చేసిన కులగణన సర్వేను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. తక్షణమే రీసర్వే చేసి, సీఎం రేవంత్‌రెడ్డి తన తప్పును సవరించుకోవాలని సూచించారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సంజయ్ మాట్లాడుతూ.. మున్నూరుకాపు సామాజికవర్గం అధిక సంఖ్యలో ఉన్నందునే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర అధ్యక్షులుగా పలుమార్లు వారినే నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిన మేరకు భారీ బహిరంగ సభకు మున్నూరుకాపులను కార్యోన్ముఖులను చేయాలని సూచించారు.
ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మున్నూరుకాపులు ఐకమత్యంతో ఉండాలని, మన జనాభా తకువచేసి చూపిన కులగణనను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా కులం బలం సంఘటితమై శక్తిని నిరూపించే సమయం వచ్చిందని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు సీ విఠల్ మాట్లాడుతూ.. తమ జనాభాను తకువ చేసి చూపడం సహించలేని తప్పిదమని పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మున్నూరుకాపు సంఘం యువత అధ్యక్షుడు బండి సంజీవ్ మాట్లాడుతూ.. సర్వే నివేదిక చిత్తు కాగితంతో సమానమని పేర్కొన్నారు. మహిళా విభాగం అధ్యక్షురాలు బండి పద్మక కులగణన నివేదికను వ్యతిరేకిస్తూ జిల్లా, మండల కేంద్రాల్లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను తగులబెట్టి సంఘటిత శక్తిని నిరూపిద్దామని చెప్పారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. న్యాయమైన వాటా సాధనకు మహోద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపనేని నరేందర్, సోమారపు సత్యనారాయణ, జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్, రౌతు కనకయ్య, సుంకర బాలకిషన్, కొత్త లక్ష్మణ్, తెలంగాణ విఠల్, ఎడ్ల రవి, ఉగ్గే శ్రీనివాస్, పిడికిలి రాజు, దుర్గం రవీందర్, మరికల్ పోత సుధీర్‌కుమార్, ఆకుల రజిత్, ఊసా రఘు, లవంగాల అనిల్, జైపాల్‌రెడ్డి, పర్వతం సతీశ్, పర్వతం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కులగణన పేరుతో జరిపిన సర్వేలో తాము తప్ప ఇతరులు ప్రభావశీలురుగా ఉండకూడదని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేశారనే అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. చాటుమాటుగా కుట్రలు చేస్తే తాము సహించేదిలేదని హెచ్చరించారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిన మేరకు 10 లక్షల మందితో మున్నూరుకాపుల కదనభేరిని మోగిద్దామని పిలుపునిచ్చారు. రాజకీయాలకు, పార్టీలకతీతంగా కులాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ఖబర్దార్.. రేవంత్‌రెడ్డీ! మున్నూరుకాపులను తక్కువ చేసి చూపెట్టారు. ఇంతకు ఇంత అనుభవిస్తారు. ప్రజాక్షేత్రంలో దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు. బలవంతుడిని బలహీనపర్చే, రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడంలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. పాలకుల కుట్రలు, కుయుక్తులను ఛేదించుకుంటూ రాజ్యాధికారం సాధించుకునే దిశగా ఆత్మైస్థెర్యంతో ముందుకుసాగుదాం’ అని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మున్నూరుకాపు సంఖ్యను తక్కువ చేసి చూపిందని రాజ్యసభ సభ్యులు, మున్నూరుకాపు సంఘం గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు. రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపై వచ్చి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తే ఐక్యతతో పోరాటం చేద్దామని పేర్కొన్నారు. మూన్నూరుకాపుల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కుల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఐక్యత, చైతన్యం, క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్షాదక్షతతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.