MRPS | హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి, ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మరోసారి మాదిగలను బీజేపీ మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నెల రోజుల క్రితం హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చిన మోదీ.. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసి వర్గీకరణ చేస్తామని చెప్పిన హామీని ఈ పార్లమెంట్ సమావేశాల్లో నెరవేర్చలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అనేక కమిటీలు, కమిషన్లు ఉన్నప్పటికీ మాదిగలను మరోసారి మోసం చేయడానికే దేశ ప్రధాని పూనుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వర్గీకరణ వ్యతిరేకులను పక్కన పెట్టుకొని మాదిగలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. వర్గీకరణను పోరాటాల ద్వారానే సాధించుకోవాల్సిన అవసరం ఉన్నదని మాదిగలు, మాదిగ ఉపకులాలకు అర్థమైందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పంథాను అనుసరించే ఎమ్మార్పీఎస్ ముందుకెళ్తదని చెప్పారు. వచ్చే జనవరిలో రాష్ట్రవ్యాప్త కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని వంగపల్లి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు యాతాకులు భాస్కర్ మాదిగ, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిలకమర్రి గణేష్ మాదిగ, హుస్సేన్ మాదిగ, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరు వెంకట్ మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వరిగడ్డి చందు మాదిగ, ఎమ్మార్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్ మాదిగ, ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు ఎల్.నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.