హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): తాను 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టు చాలామంది భావిస్తారని, కానీ, అసలు ఉద్యమం 1999లోనే మొదలైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటేనే నవ్వులాటగా ఉండేదని, ప్రత్యేక రాష్ట్రం ఒక కలగా ఉండేదని.. స్వరాష్ట్రం ఏర్పడుతుందని, పదేండ్ల పండుగ జరుపుకుంటుందని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైపోయిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదిగిందని వివరించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. ‘కొన్ని క్షణాలు చాలా గొప్పవిగా ఉంటాయి, జీవితంలో బాధపెట్టేవిగా ఉంటాయి. ఈరోజు గొప్ప ఉద్విగ్న క్షణం’ అని పేర్కొన్నారు. 1999, అంతకుముందు కాలంలో తెలంగాణ అనుభవించింది ఒక భయంకరమైన బాధ. అది ఊహించుకుంటనే దుఃఖం వచ్చే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఆ రోజుల్లోనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 25-30 మంది శాసనసభ్యులతో కనీసం 30సార్లు సమావేశాలు పెట్టామని, ఏమి చేయాలో ఆలోచించేవారమని చెప్పారు. ఆ రోజుల్లో ‘తెలంగాణ’ అని మాట్లాడుడే కష్టంగా ఉండేదని గుర్తుచేశారు. ఎమ్మెల్యే ప్రణయ్‌భాస్కర్ శాసనసభలో ‘తెలంగాణ’ అని మాట్లాడుతుంటే, నాటి స్పీకర్ ‘తెలంగాణ’ అనే పదమే మాట్లాడొద్దు, వెనకబడిన ప్రాంతమని మాట్లాడండన్నారని చెప్పారు.
పంథా, వ్యూహం లోపం విఫలం
1969లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమం, పంథా లోపం వల్ల, వ్యూహ లోపం వల్ల ఘోరంగా విఫలమైపోయింని కేసీఆర్ పేర్కొన్నారు. 1969 ఉద్యమ సమయంలో తాను 9వ తరగతి విద్యార్థినని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేటలో ఉప ఎన్నిక వస్తే టీపీఎస్ తరుఫున మదన్మోహన్ పోటీ చేశారని, మర్రి చెన్నారెడ్డి, రాజారాం, రాజమల్లు, అంజయ్య తదితరులు తమ ఇంట్లోనే క్యాంపు చేశారని, తాను వారికి భోజనాలు వడ్డించానని గుర్తుచేసుకున్నారు. చెన్నారెడ్డి నాయకత్వంలో 14 ఎంపీలకుగాను 11 గెలిచినా, ఆనాడు ఇందిరాగాంధీ కనికరించలేదని చెప్పారు. అనాటి టీఎన్జీవో అధ్యక్షుడు ఆమోస్ గొప్ప పోరాటయోధుడని, ఆయనను భయంకరంగా బెదిరించినా, పీడీ యాక్ట్ పెట్టినా, ఉద్యోగం తీసేసినా, నెలల తరబడి జైళ్లో పెట్టినా ఎక్కడా రాజీపడలేదని కొనియాడారు. తాను ఉద్యమాన్ని ప్రారంభించేనాటికి జయశంకర్‌లాంటి వ్యక్తి ఉన్నారనే విషయం కూడా తనకు తెల్వదని చెప్తూ , ఆయనతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. జయశంకర్ జన్మంతా తెలంగాణవాది అని, అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్ అని, అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారని వివరించారు. ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మనందరెడ్డి జయశంకర్‌ను పిలిచి బెదిరిస్తే భయపడకుండా, తెలంగాణ పంథా వీడే ప్రశ్నే లేదన్న ధీశాలి అని కొనియడారు.
అపనమ్మక స్థితి నుంచి.. సాధించే దాకా..
అప్పట్లో తెలంగాణ ఉద్యమం పేరెత్తితేనే.. రాజకీయ నిరుద్యోగులని, పైసలు వసూలు చేసే దుకాణమని బద్నాం చేసేవారని కేసీఆర్ వివరించారు. ఈ కుట్రలను తిప్పి కొట్టడానికే పదవులన్నింటికీ రాజీనామా చేశానని వివరించారు. ఉద్యమం ప్రారంభించేనాటికి పిడికెడు మందే ఉన్నారు. కరీంనగర్లో సింహాగర్జన సభ పెట్టినం. అప్పుడు హరీశ్ యువకుడు, అనుభవం కూడా లేదు. అయినా ఒక్క మనిషి పోయి అక్కడ కూర్చున్నడు. దానిని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నం. మే నెలలో.. ఆ ఎర్రటి ఎండల్లో.. ఆ రోజులు జ్ఞాపకం వస్తే.. కండ్లల్లో నీరు వస్తయి’ అని ఉద్వేగానికి లోనయ్యారు. తదనంతరం పరిణామాల్లో ఎందరో మిత్రులు, గొప్ప గొప్ప వాళ్లు కలిశారని చెప్పారు. విద్యాసాగర్‌రావు, కళ్లెం యాదగిరిరెడ్డి వంటివారు ఇప్పుడు కూడా తన పక్కకు ఉన్నరా? అనిపిస్తదని చెప్పారు. తెలంగాణ ఉద్యమ రూపాలు యాది చేసుకుంటేనే ఒళ్లు పులకరిస్తదని, పిలిపిస్తే లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారని గుర్తుచేసుకున్నారు. ఉద్యమం ప్రారంభంలో పార్టీ ఆఫీస్ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇస్తే.. కుట్రతో ఆయన బిల్డింగ్ కూలగొట్టి, సామాన్లు రోడ్డుమీద పడేశారని గుర్తు చేశారు. తదేక దీక్షతో పదేండ్ల పాలన రాష్ట్రం సిద్ధించిన తర్వాత డంభాచారాలకో, పీఆర్ స్టంట్లకో పోకుండా తదేక దీక్షతో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేశామని కేసీఆర్ వివరించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, కరెంటు, పేదల సంక్షేమ పథకాలు, అన్ని సామాజిక వర్గాలకు మంచి పనులు.. ఇలాంటవన్నీ చాలా అద్భుతంగా చేశామని, దాని ఫలితాలు వచ్చాయని వివరించారు.
రైతుబంధును ఓట్ల కోసం ఇవ్వలేదని, ఒక అవగాహనతో, వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చామని స్పష్టంచేశారు. దాంతో తెలంగాణ జీఎస్డీపీలో 18.32% వ్యయసాయ రంగం నుంచి వచ్చే స్థాయికి ఎదిగిందని చెప్పారు. చేపపిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెసోళ్లు అసెంబ్లీలో అపహాస్యం చేశారని, కానీ ఇప్పుడు రూ.30 వేల కోట్ల చేపపిల్లలను అమ్మే స్థాయికి ఎదిగామని వివరించారు. గొర్రె పిల్లలు పంపిణీ చేస్తుంటే కూడా అపహాస్యం చేశారని, ఒకప్పుడు మాంసం ఉత్పత్తిలో అడుగుభాగాన ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశంలో నంబర్ వన్ స్థానానికి ఎదిగిందని చెప్పారు. పింఛన్లు, రైతుబంధు లాంటి పథకాల ద్వారా రూ.వేల కోట్లను గ్రామీణ ప్రాంతాలకు పంప్ చేశామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశామని వివరించారు. తద్వారా పల్లెలు బాగయ్యాయని చెప్పారు. హరితహారం, పల్లెప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, పల్లెబాట, పట్టణబాట, పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు బ్రహ్మాండంగా తయారయ్యానని చెప్పారు. దేశంలో ప్రతి ఊరిలో ట్రాక్టర్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. ప్రతి ఊరిలో పార్కు ఉన్న రాష్ట్రం తెలంగాణ. జీఎస్డీపీలో నంబర్‌వన్ తెలంగాణ. తలసరి ఆదాయంలో నంబర్‌వన్ తెలంగాణ. పరిశుభ్రమైన నీళ్లు ఇచ్చింది తెలంగాణ, నిరంతరం కరెంట్ ఇచ్చింది తెలంగాణ. ఇట్లా ఎన్నింటిలోనో నంబర్‌వన్ చేసినం’ అని కేసీఆర్ వివరించారు.
చేతిరాతతోనే రాజీనామా లేఖ రాసి పంపిన..
“అవ్వకు, అయ్యకు గాకుండ ఉన్న తెలంగాణ. చాలా భయంకర పరిస్థితులు. దిక్కుతోచని స్థితి. తెలంగాణకు ఒక పత్రిక లేదు. టీవీ లేదు. వాళ్లు రాసిందే రాత. అప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడే గెలిచిండు. 29 ఎంపీలు. ఎన్డీఏ కన్వీనర్ 20 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉంటనని చెప్తున్నడు. గా టైమ్‌ల ఉద్యమం మొదలుపెట్టిన’ అని కేసీఆర్ వివరించారు. ‘అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్తు చార్జీలను పెంచి మూడేండ్లు వరుసగా 15% పెరుగుతదని ప్రకటించింది. నా మిత్రుడు బాలమల్లు అప్పుడు సిద్దిపేట కౌన్సిలర్‌గా ఉండె. నేను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న. ఆ రోజు విజిటర్లను పంపించి ఇద్దరమే ఉన్నం. తేజ చానల్లో విద్యుత్తు చార్జీల పెంపు వార్తలను చూసిన. ఆగ్రహం ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది. ఫోన్‌చేస్తే ముఖ్యమంత్రి విజయవాడ వెళ్లారని చెప్పారు. ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిన. సంతకం పెట్టినం. టైప్ కూడా చేయలె. 50 కాపీలు చేసి పేపర్లకు పంపిన. విద్యుత్తు చార్జీల పెంపుపై క్యాబినెట్లో గొడవ పడ్డ. ఇప్పుడు పెంచితే తెలంగాణ రైతు వ్యవసాయం చేయలేడు.
మా కండ్ల ముందే మా రైతుల బొండిగే పిసుకేస్తా ఉంటే, మౌనంగా ఉంటే అర్థం లేదు.. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయాల్సి వస్తదని లెటర్ రాసిన” అంటూ ఆనాటి నాటి రాజీనామా అంశాన్ని కేసీఆర్ వివరించారు. తాను ప్రారంభించిన ఉద్యమం చాలామంది 2001లో మొదలైందని అనుకుంటారని, కానీ అసలు ఉద్యమం 1999లోనే మొదలైందని తెలిపారు. 1999 చివరి నుంచి 2000 సంవత్సరం దాకా మేధోమథనం చేశామని వివరించారు. ‘నిమ్మ నరసింహారెడ్డి అని సిద్దిపేటలో నా సహచరుడు ఉండేది. రోజూ రాత్రి 3 వరకు మాట్లాడుకునే వాళ్లం’ అని గుర్తు చేశారు. 2000 సంవత్సరంలోనే తెలంగాణ ఉద్యమం కోసం పాట క్యాసెట్ తయారైందని, జెండా కూడా అప్పుడే తయారైందని చెప్పారు. రసమయి బాలకిషన్, ఇతర కళాకారులు పాటలు పాడారని తెలిపారు. ఆనాడు తాను కూడా కొన్ని పాటలకు కొన్ని పదాలు రాశానని, అవి సూపర్‌హిట్ అయ్యాయని ఆనాటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో దిగజారిన పరిస్థితులను కండ్లకు కట్టేవిధంగా ‘బతుకమ్మ’ సినిమా తీయాలన్న ఉద్దేశంతో కథ రాసిపెట్టుకున్నట్టు వెల్లడించారు.