హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ దీక్షా దివస్‌కు సర్వం సిద్ధమైంది. తెలంగాణవ్యాప్తంగా శనివారం అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. నాటి ఉద్యమ తీరుతెన్నులు, కేసీఆర్ ఆమరణ దీక్షా స్ఫూర్తిని చాటాలని సంకల్పించింది. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్తోపాటు జిల్లాల్లోని పార్టీ ఆఫీసులను అందంగా అలంకరించారు. ఆవరణలను కేసీఆర్ చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు. గులాబీరంగు విద్యుద్దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పల్లెలు, పట్టణాల్లో వాడవాడలా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేశారు. దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి నాటి పోరాట జ్ఞాపకాలను గుర్తుచేసుకోనున్నారు.
దీక్షా దివస్‌ను పురస్కరించుకొని కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయనున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా వృద్ధాశ్రమాల్లో అన్నదానం, పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేయనున్నారు. దవాఖానల్లో రోగులకు పండ్లు అందించనున్నారు. నిరుపేదలకు బట్టలు పంపిణీచేయనున్నారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నారు. పార్టీ ఆఫీసుల్లో అప్పటి ఉద్యమ ఘట్టాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న వేడుకలకు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ బాధ్యులు, పార్టీ ముఖ్యులు హాజరుకానున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన దీక్షా శిబిరాల్లో పాల్గొననున్నారు. ఉద్యమ జ్ఞాపకాలతో చిత్రప్రదర్శనలను ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.
దీక్షా దివస్‌కు హైదరాబాద్ తెలంగాణభవన్ శోభాయమానంగా ముస్తాబైంది. ఆవరణలో ఏర్పాటుచేసిన కేసీఆర్ చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలు, తోరణాలతో గులాబీ రంగులో మెరిసిపోతున్నది. గులాబీ వర్ణపు విద్యుత్తు కాంతుల్లో మిరుమిట్లు గొలుపుతున్నది.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. సేవా కార్యక్రమాలు, ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు. మాజీ మంత్రి మహమూద్‌అలీ, పద్మారావు, హైదరాబాద్ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, పార్టీ ముఖ్యులు సైతం హాజరుకానున్నారు. 150 డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలిరానున్నారు.