తెలంగాణ ఉద్యమచరిత వేల పుటల బృహత్గ్రంథం. ఉద్యమ పథంలో కీలక పరిణామాలు, మరుపురాని సందర్భాలు కోకొల్లలు. కానీ రాష్ట్రసాధన ఉద్యమాన్ని మలుపుతిప్పి, గెలుపు వైపు నడిపించిన అరుదైన ఘట్టం.. దీక్షాదివస్! అది కేసీఆర్ సంకల్ప బలానికి, దీక్షాదక్షతకు సాక్ష్యం! అది అరవై ఏండ్ల పోరాటానికి క్లైమాక్స్ ఎపిసోడ్!
ఆ 11 రోజులు.. తెలంగాణ నలుదిశలను ఏకం చేసింది. ‘ప్రత్యేక రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో!’ ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో!’ అని గర్జించేంత ధైర్యం, తన ఉద్యమంపై నమ్మకం ఏ నాయకుడికి ఉంటుంది? ఒక్క కేసీఆర్‌కు తప్ప. అందుకే రాష్ట్ర సాధన కోసం రణగర్జన చేసి కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష. గల్లీ గల్లీనీ కదలించింది. ఢిల్లీని వణికించింది! సిద్దిపేట దీక్షాస్థలికి కరీంనగర్ నుంచి వీరతిలకంతో బయల్దేరిన కేసీఆర్‌ను అలుగునూరు వద్ద అరెస్టు చేసి.. వరంగల్‌కు, అక్కడినుంచి ఖమ్మంకు తరలించింది ప్రభుత్వం.
తుఫానులకే వెరవని కేసీఆర్ పిల్లవానకు జడుస్తాడా? ఉన్నచోటే నిరాహారదీక్షకు దిగిండు. జైలు గోడలు, దవాఖాన వార్డులు ఆయన సంకల్పాన్ని ఆపలేకపోయాయి. తమ నాయకుడి దీక్ష మీద సమైక్యవాద సర్కారు కుట్రలకు దిగడాన్ని తట్టుకోలేక జనం రోడ్డెక్కారు. కరీంనగర్ నుంచి ఖమ్మం దాకా ఉద్యమ విద్యుత్తేజం వ్యాపించింది. ఉస్మానియాలో భూకంపం పుట్టి.. ఊరూరుకు విస్తరించింది. ఇనుప కంచెల మధ్య ఉస్మానియా యువతరం ఉక్కుపిడికిలెత్తింది. కణకణమండే మంటల్లోనూ శ్రీకాంతాచారి ‘జైతెలంగాణ’ అంటూ చేసిన రణనినాదం తెలంగాణ అంతటా ప్రతిధ్వనించింది.
గత్యంతరం లేని పరిస్థితిలో ఢిల్లీ మెట్టు దిగింది. తెలంగాణ ముందు తలవంచింది. ప్రత్యేక రాష్ర్టానికి తలూపింది. ఫలితమే డిసెంబర్ 9 ప్రకటన. ఆ మాటపైనా కాంగ్రెస్ నిలబడలేకపోవడం, శ్రీకుట్ర కమిటీని దింపడం, తెలంగాణ సకలజనులూ ఉద్యమంలో చేయి కలపడం వంటివి తదనంతర పరిణా మాలు. వాటిన్నింటి ఫలితమే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ర్టావిర్భావం. అరవై ఏండ్ల కల సాకారమైంది. ఆ జ్వలిత చరితకు కాపుకాసిందీ, కథానాయకుడై ముందుండి నడిపిందీ కేసీఆరే. ఆ యన దీక్షాదక్షతకు సాక్షీభూతమే 2009 దీక్షాదివస్. సదా మరువని ఆ యాదికి నేటితో 16 ఏండ్లు!

నాడు నిమ్స్ దవాఖానలో దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్

నిమ్స్ దవాఖానలో కేసీఆర్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్‌రావు, మందకృష్ణ, స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్

నిమ్స్ దవాఖాన నుంచి వీల్ చైర్లో బయటకు వస్తున్న కేసీఆర్. చిత్రంలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్

ఆమరణ దీక్షకు బయలుదేరుతున్న కేసీఆర్ కరీంనగర్ నివాసంలో వీరతిలకం దిద్దుతున్న మహిళ

కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఓయూలో కదంతొక్కిన విద్యార్థులు

కేటీఆర్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

కరీంనగర్‌లోని నివాసం నుంచి ఆమరణ దీక్షకు బయలుదేరుతూ విజయ సంకేతంతో అభిమానులకు అభివాదం చేస్తున్న కేసీఆర్

ఖమ్మం దవాఖానలో దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్‌ను పరామర్శిస్తున్న హరీశ్‌రావు తదితరులు

ప్రొఫెసర్ జయశంకర్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఓయూ క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న బాల్క సుమన్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

కేసీఆర్ అరెస్టు నేపథ్యంలో సిద్దిపేటలోని దీక్షాస్థలిలో పెట్రోల్ పోసుకుంటున్న హరీశ్‌రావు

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు.. మోహరించిన పోలీసులు

కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో పోలీసుల వలయాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు

ఎల్బీనగర్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న శ్రీకాంతాచారి