Mahabubnagar | మహబూబ్ నగర్, జూన్ 09 : తెలంగాణ ఉద్యమ నేత, పాలమూరు పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా మొల్గర వినోద్ కుమార్ (45) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే వినోద్ కుమార్‌కు గత కొన్ని రోజుల క్రితం పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న భూమి విషయంలో వేరే వాళ్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన పొలంలో ఓ వ్యక్తి చనిపోతే అతని దహన సంస్కారాలు వినోద్‌కు చెందిన భూమిలో బొంద పెట్టారు. విషయం తెలుసుకున్న భూమి కొనుగోలుదారులు వినోద్‌తో గొడవకు దిగి, బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అప్పటినుంచి వినోద్ మనస్థాపానికి గురై బుధవారం ఉదయం ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే వినోద్ కుమార్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. దీంతో వైద్య ఖర్చుల కోసం ఆస్తులు అమ్మి వైద్య సేవలు పొందుతున్నాడు. క్యాన్సర్ వ్యాధి కణాలు పూర్తిగా తగ్గిపోయాయని అనుకున్న తరుణంలో, తన భూమిని అన్యాయంగా లాక్కునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడంతో అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆయన మృతికి భూ వివాదాలే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.