Telangana | సరిగ్గా ఇరువై రెండేండ్ల కింద. 2001 కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ సింహగర్జన సభ కవరేజీ కోసం మీడియా వాళ్లను తీసుకుపోవడానికి బస్సులు పెట్టారు. సభను కవర్ చేసే డ్యూటీ నాకు వేయకపోయినా సెలవు పెట్టీ మరి నేను కూడా మీడియా బస్సెక్కాను. కరీంనగర్‌కు బయల్దేరాక దారి పొడుగునా కేసీఆర్ కారుకు జనం ‘జై తెలంగాణ’ అంటూ నీరాజనం పడుతుంటే నా మనసులో ఎన్నో ఆలోచనలు సుడుల్లా తిరిగాయి.
తెలంగాణ కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నా అవి విజయతీరాన్ని చేరుకోలేదు. నాటి ఉద్యమాల్లో యువకుడిగా నేనూ ఓ భాగస్వామిని. నాటి పొరపాట్లను సరిదిద్దుకొని స్పష్టమైన వైఖరితో తెలంగాణ కోసం ఓ రాజకీయపార్టీ ఏర్పాటు కాబోతున్నది. నిజంగా నాకు చాలా ఉద్విగ్నంగా అనిపించింది. ఈ ప్రాంత ప్రజల పక్షాన గొంతు విప్పేందుకు అవకాశమే లేనిరోజుల్లో, నిత్య నిర్బంధాల మధ్య నలుగుతున్న తెలంగాణ ప్రజల ఆశాదీపంలా అనిపించింది కేసీఆర్ నిర్ణయం. అహింసాయుతంగా ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా ముందుకుసాగుతామని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001 ఏప్రిల్ మాసం శుక్రవారం నాడు గులాబీ జెండాను తెలంగాణ ప్రజల ముందుకుతెచ్చా రు. నాడు జర్నలిస్టుగా వీటన్నింటికీ సాక్ష్యంగా ఉన్న నేను నేడు ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తీరు.. పదేండ్ల స్వయంపాలన సాధించిన ఫలితాలన్నీ కండ్ల ముందే కన్పిస్తున్నాయి. నాటి ఉద్విగ్నత, నేటి విజయ పరంపరలోనూ కొనసాగుతున్నది.
తెలంగాణ రాదన్నారు, వచ్చినా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఒక బక్కపల్చటి జీవి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశారు. ఎల్లలోకాలు ఎలుగెత్తి చాటేలా తన విజయదుందుభి మోగించారు. ఈ జగాన తెలంగాణ జనకీర్తిని ఏడు ఖండాలకు చాటిచెప్పారు. అకుంఠిత దీక్షాదక్షతలుంటే సాధ్యం కానిదేదీ లేదని నిరూపించి తనదైన చరిత్రను సృష్టించుకున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్.
రాజుల కాలంలో ఏదో సందర్భంలో వెయ్యేండ్ల నుంచి దక్కన్ ప్రాంతంలో హింస లేని రోజు లేదు. కానీ ఈ పదేండ్ల కాలంలో కారుమబ్బులు తొలగి సువిశాల వినీలాకాశంలా ప్రశాంతంగా ఉన్నది తెలంగాణ. ఇలాంటి రోజులు వస్తాయని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించలేదు. ఒక బీభత్సమైన ఉద్యమం ఇంతటి ప్రశాంత వాతావరణాన్ని తీసుకొస్తుందని, తమ జీవితాల్లో వెలుగు తీసుకొస్తారని ఇక్కడి ప్రజల ఊహల్లో లేని విషయం. కానీ అది నిజమై కండ్లముందు ఆవిష్కృతమైంది. ఈ నిజానికి పునాది పడి 22 ఏండ్లయింది.
పత్తి రైతులు పాడెక్కిన నేలల్లో పసిడి తెలంగాణ సరికొత్త సరాగాలు పాడే చోటుకు ఇప్పుడు కేంద్ర స్థానమైంది. దక్కన్ పీఠభూమి సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉందో పదేండ్ల పాలనాతీరు ఆ ఎత్తును కూడా తుత్తునియలు చేసి.. స ముద్రపు ఎత్తే ఈర్ష్యపడేలా ఇక్కడ పాలన సాగుతున్నది. అంతకుమించిన ఎత్తులో పీఠభూమే కాదు ఇక్కడ పాలనా, పౌరుల ఆత్మగౌరవం సగర్వంగా నిలబడేలా చేసింది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వ పటిమనే కారణం. మానవ మాత్రులకు సైతం సాధ్యం కాని నల్గొం డ ఫ్లోరైడ్ భూతం అంత సులభంగా వీడేదికాదు. ఏ దేవ దానవుల శాపమో తెలియదు కానీ పిల్లకి తల్లి, తల్లికి పిల్ల కాని జీవితాలు నాటి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలవి. కరువు, వలసలకు దిక్సూచీలు నాటి ఊర్లు. అంబలి కేంద్రాలకు, పొక్కిల్లేసిన వాకిళ్లకు ఆనవాళ్లు నాటి పల్లెలు. ఇంతటి దుర్భర స్థితిలో కను కొలుకుల్లో నీళ్లు తిరిగిన బడుగుజీవుల బతుకులు పదేండ్ల పాలనా సౌరభానికి ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. తమ జీవితాలు ఇంతే అనుకునే దశలో ఎర్ర చెల్కలకు దుసరి తీగెలా.. దుమ్మూ ధూళికి వొంగి, వాడిపోయిన గన్నేరు మొక్కలకు ఆయువుగా 22 ఏండ్ల కింద తెలంగాణకు ఈ చరిత్ర అందించిన ఆయుధం టీఆర్ఎస్. ఈ అమృతాయువుకు నేటికి ఇరువై రెండేండ్లు.
దక్కన్ బిడ్డలకు పోరాటమే తప్ప విజయాలు తెలియవని చరిత్రలో ఓ ఆనవాయితీ. అంతే కాదు, ఇక్కడ పంటలు పండిస్తారు కానీ ఫలితాలు తీసుకోరనీ ప్రతీతి. కానీ ఇవన్నీ పూర్వపక్షం చేసి ముమ్మాటికీ ప్రజలే విజయం సాధిస్తారని నిరూపించింది గులాబీ జెండా. ఎందుకంటే ప్రజలనే అజెండాగా ఎంచుకున్నది గులాబీ జెండా. ప్రజల ఆశలు, ఆశయాలకనుగుణంగా నడుచుకున్నది.
తాను నమ్మిన ప్రజాస్వామిక ఉద్యమదారిలో సమరాన్ని పరుగులు పెట్టించింది. వేప పువ్వులు పరిమళాలను, లేలేత పునాస పంటల సున్నితత్వాన్ని ఒడిసిపట్టుకొని ఎండలకు, వానలకు తట్టుకునేలా తన ఉద్యమ కార్యకర్తలను తయారుచేసుకున్నది గులాబీ జెండా. తెలంగాణ పునాస పంటలా కాలం కాని కాలానికి ఎదురెల్లి ఉద్యమ లక్ష్యాన్ని చాటుకొని ఇంతటి అసాధ్య విషయాన్ని సుసాధ్యం చేసింది గులాబీ జెండా. ఈ జెండా పుట్టి ఇరువై రెండేండ్లు.
అగ్గిపెట్టెల నుంచి ఐటీ వరకు అంతా తామే అని చెప్పుకొన్న తెలంగాణ వ్యతిరేకుల చెంప చెళ్లుమనిపించేలా కేటీఆర్ ప్రణాళికలు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయి. ఆకాశంలో ఎంత ఎత్తులో నుంచి చూసినా ఈ భూమికి పదేండ్లలో హైదరాబాద్ కేంద్రం అద్భుతంగా ఆవిష్కృతమైంది. నాలుగు అద్దాలు అమర్చి వేల అబద్ధాలు చెప్పిన నాటి బాబు.. డాబు, డూబుల కంటే వాస్తవం ఎట్లా ఉందో ఇప్పుడు ప్రతీ తెలంగాణ బిడ్డ ఐటీలోనే కాదు, యావత్ ప్రపంచానికి సర్వాంశాల్లో తమకు లేదు పోటీ అని చెప్పేలా ప్రణాళికలు, పనులు జరిగిపోయాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలొడ్డి పోరాడిన యోధులు నేడు స్వయం పాలనా ఫలితాలను ప్రజలకు అందించడంలో పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నగరకీర్తిని, ఖ్యాతిని, పాలనా తీరుతెన్నులును నలుచెరుగులా చాటి చెప్తున్నారు. తమ ప్రజల ఆకాంక్షలు తెలిసిన వీరికి, తమ వారి ఆకలిదప్పులేమిటో ఇంకొకరు చెప్పాల్సిన పనిలేదు. అందుకే పేద తల్లి కంచంలో మెతుకులవుతున్నారు. రైతు నాగలికి ఆదెరువు అవుతున్నారు. స్వయం పాలన ఇట్లా ఉంటుందని ఉద్యమ సమయంలో చెప్పి నేడు ఆచరణలో చూపిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
పాలన ఎవరైనా సాగిస్తారు. పథకాలెవ్వరైనా ప్రవేశపెడతరు. కానీ, వాటిని అమలుచేసే నాయకత్వానికి హృదయం ఉండాలి. అన్నింటికి మించిన ప్రతీ విషయంలో, ప్రతీ చర్యలో ఆత్మగౌరవం తొణికిసలాడాలి. మహోద్యమ నాయకుడు కేసీఆర్ ప్రతీ సందర్భంలో ఈ పనిచేసి చూపించారు. ఈ దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో ప్రపంచ మేధావి అంబేద్కరుడిని ఆవిష్కరించారు. ఆర్టికల్-3కు కృతజ్ఞతాపూర్వకంగా సచివాలయానికి ఆయన పేరుపెట్టారు.
అంబేద్కర్ ఆశించిన దళితజాతి జనోద్ధరణ మరింత ఆచరణాత్మకంగా దళితబంధు పథకాన్ని పెట్టారు. ఉమ్మడి పాలకులు కాటగలిపిన తెలంగాణ రైతు కాడికి పదునుపెట్టారు. తళతళమెరిసే తారు రోడ్లే కాదు, తెలంగాణలోని ప్రతీ పల్లె ఆత్మగౌరవ జెండా అయ్యేలా చేశారు. పదేండ్ల పాలనను డబ్భు ఏండ్ల పనితీరుకు సరి సమానం చేశారు.
ఇంకా చెప్పాలంటే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు. అట్టడుగుజీవుల బతుకు బావుటాకు ఇరువై రెండేండ్లు. బొంబాయి, బొగ్గు బాయి, దుబాయి ప్రయాణాలు ముగిసేందుకు తొవ్వపడింది టీఆర్ఎస్తోనే. తెలంగాణ పచ్చదనానికి పునాది పడింది ఇరువై రెండేండ్ల కిందటనే. హైదరాబాద్ నగరం సరికొత్త సరాగాలు పలికేందుకు దారిపడింది ఇరువై రెండేండ్ల కిందటే. అట్టడుగుజీవులు, అనామకులు అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు మార్గం చూపింది ఇరువై రెండేండ్ల కిందటనే. మొత్తానికి మహోద్యమ నాయకుడు కేసీఆర్ రూపొందించిన గులాబీ జెండాకు ఇరువై రెండేండ్లు. అంతకుమించి ప్రపంచానికి మార్గం చూపిన ప్రజాస్వామ్య ఉద్యమ స్వభావానికి, విజయానికి, దానికి నాయకత్వం వహించిన నాయకుని చైతన్యానికి లెక్కలేని… ఎవ్వరూ లెక్కవేయలేని అనంతానంత విజయ మైలురాళ్లకు ఇరువై రెండేండ్లు. ఇంకా చెప్పాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరుడు గుత్తకు తీసుకున్న ప్రజాస్వామ్య ఉద్యమ ప్రస్థానానికి ఇరువై రెండేండ్లు. జైహింద్, జై తెలంగాణ, జై భీమ్, జై భారత్…
(వ్యాసకర్త: శాసనసభ్యులు, ఆందోల్)
చంటి క్రాంతికిరణ్