హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఒక వ్యాపార సంస్థపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. నిజాన్ని చూపించే ప్రయత్నం చేసిన బీబీసీపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ఉసిగొల్పిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన వారిపై, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు.
మోదీది నియంతృత్వం
ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వపు అంచులకు చేరుకున్నారు. మొదట బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించారు. ఇప్పుడు ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. హిట్లర్ నియంతృత్వం కూడా ఒక రోజు ముగిసింది. మోదీ నియంతృత్వం కూడా కచ్చితంగా ముగిసిపోతుంది.
ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ అనగలమా?
‘మొదట బీబీసీ డాక్యుమెంటరీలు నిషేధించారు. అదానీ అవకతవకలపై జేపీసీ వేయలేదు. విచారణ జరపలేదు. ఇప్పుడు బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లి అంటే ఇదేనా’.
– సీతారాం ఏచూరి, సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి
గొంతు నొక్కే ప్రయత్నం
‘సత్యం అంటే భయపడుతున్న ప్రభుత్వం దాని గొంతు నొక్కేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ దాడి. ప్రపంచం మొత్తం దీనిని చూస్తున్నది. జీ-20కి నేతృత్వం వహిస్తున్న మోదీని భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నిస్తే ఆయన నిజాన్ని చెప్పగలరా?’.
– బినోయ్ విశ్వం, సీపీఐ ఎంపీ
నిజాలు మాట్లాడే వారిపై దౌర్జన్యం
‘బీబీసీ కార్యాలయాలపై దాడికి కారణం, దాని పర్యవసానం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతిపక్ష నేతలు, మీడియా, ఎవరైనా నిజాలు మాట్లాడితే వారిపై కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యం చేస్తున్నది. సత్యం కోసం పోరాడుతున్నందుకు చెల్లిస్తున్న మూల్యం ఇది’
– మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం
ఇది క్రూరమైన ధోరణి
‘మీడియా కార్యాలయంపై సోదాలు ప్రజాస్వామ్యంలో ఏ రకమైన పద్ధతి? అంటే, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. కానీ ఎవరూ దానిపై గొంతెత్తొద్దు. మాట్లాడితే దాడులు చేస్తారు. ఒక క్రూరమైన ధోరణి దేశంలో ప్రవేశించింది. మనం కలిసి ఎదుర్కోకపోతే ఈ ధోరణి దేశం మొత్తాన్ని మింగేస్తుంది.
– ఉద్ధవ్ ఠాక్రే, శివసేన(యూబీటీ) నేత
వినాశకాలే విపరీత బుద్ధి
‘విమర్శించే గొంతులను నొక్కడానికి ప్రభుత్వం ఏమాత్రం సంకోచించడం లేదు. మోదీ హయాంలో పత్రికా స్వేచ్ఛపై పదేపదే దాడి జరుగుతున్నది. ప్రతిపక్షాలు, మీడియాపై దాడికి ప్రభుత్వ సంస్థలను ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు. మేము అదానీపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వం బీబీసీ వెంట పడుతున్నది. వినాశకాలే విపరీత బుద్ధి.
– కాంగ్రెస్ పార్టీ
ఐటీ సోదాలు ఆందోళనకరం
ఏ వ్యవస్థా చట్టానికి అతీతం కాదు. బీబీసీపై ఐటీ సోదాలు ఆందోళనకరం. మీడియా సంస్థలు స్వేచ్ఛగా పనిచేయకుండా జోక్యం చేసుకోవడం, బెదిరింపులకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. రాజ్యాం గం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతం కలిగిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ చర్యలు బలహీనపరుస్తాయి.
– న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్