కేసీఆర్ నాయకత్వం కావాలంటున్నది..
సీఎంకు మంత్రుల జన్మదిన శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్న విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని సంక్షేమం దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నది
దేశాన్ని పరిపాలించే సమర్థత కేసీఆర్‌కు ఉన్నది. ప్రజలు, జాతీయ స్థాయి నాయకులు కేసీఆర్ నాయకత్వంకోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు, ఆదర్శ పరిపాలనను అన్ని రాష్ర్టాలవాళ్లు కోరుకొంటున్నారు. కేసీఆర్ జన్మదినాన్ని తెలంగాణతోపాటుగా ఢిల్లీ, వారణాసి, గుజరాత్, ఏపీలోనూ జరుపుకొంటున్నారు. విదేశాల్లో కూడా వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందింది. మేనమామగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పెద్దన్నగా రైతుబంధు, పెద్ద కొడుకుగా ఆసరా పథకాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నారు.
– స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కారణజన్ముడు
కేంద్రం నుంచి సహకారం లేకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణను అన్నిరంగాల్లో ముందంజలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌ది. సీఎం కేసీఆర్ కారణజన్ముడు. స్వరాష్ర్టాన్ని స్వప్నించి కలను సాకారం చేసి ప్రజల ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేర్చిన నాయకుడు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు లేదు. రంగనాయకసాగర్ నిర్మాణం జరిగి ఉండేది కాదు. గుక్కెడు నీళ్ల కోసం తపించిన తెలంగాణను, సస్యశ్యామల తెలంగాణ చేసిన నాయకుడు. కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని వేడుకొంటున్నా. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావితరాలకు బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది. మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగ రోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకొన్న ఈ ముద్దుబిడ్డ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
– ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు
కేసీఆర్.. నా నాయకుడు
సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా మార్చుకొన్నారు. దయతో నిండిన హృదయంతో ముందుకు నడిపిస్తారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఆయనకు ఉన్నది. కేసీఆర్.. నా నాయకుడు, తండ్రి అని గర్వంగా చెప్పుకొంటా. ఆయనపై దేవుని ఆశీస్సులు ఉండాలి. ఆయురారోగ్యాలతో జీవించాలి. అని ట్వీట్లో పేర్కొన్నారు.
– మంత్రి కేటీఆర్
కారణజన్ముడా కలకాలం వర్ధిల్లు
మీ జననం తెలంగాణ జన్మ కారణం. కారణజన్ముడా కలకాలం వర్ధిల్లు. తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
– ఎంపీ సంతోష్ కుమార్
రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టిన నేత
రాష్ట్ర ఏర్పాటు కోసమే జన్మించిన నేత సీఎం కేసీఆర్. ఆయనతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఉద్యమ సమయంలో వ్యతిరేక శక్తులు తెలంగాణ రాదన్నా, ఆత్మవిశ్వాసంతో మేధావి వర్గాన్ని ఏకం చేసి నడిపించారు. రాష్ట్రం కోసం కొట్లాడి, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి రాష్ర్టాన్ని సాధించారు. ప్రధానమైన కరెంటు సమస్యను పరిష్కరించి, దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు కరెంటు, దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు. కరువుతో అల్లాడుతున్న రాష్ర్టానికి గోదావరి, కృష్ణా జలాలతో కోటి ఎకరాలకు నీళ్లు అందించి, దేశంలోనే అత్యధిక పంటలు పండే రాష్ట్రంగా తయారుచేశారు. బీడువారిన నేలను పచ్చదనంతో నింపిన ఘనత కేసీఆర్‌ది.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
కేసీఆర్ ప్రధాని కావాలి
దేశ ప్రజలంతా మోదీ పాలనపై విసుగెత్తిపోయారు. ఇప్పుడున్న నాయకత్వంతో దేశ పరువు మసకబారుతున్నది. కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో పేదలు, రైతులకు అందుతున్న ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి. ఆదర్శమైన పరిపాలనతో దూసుకుపోతున్న తెలంగాణపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కడుపులో విషం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఎవరైనా కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే భరతం పడతాం.
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కేసీఆర్ సేవలు దేశానికి అవసరం
ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ సేవలు దేశానికి అవసరం. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ కొత్తపార్టీని స్థాపించినా ప్రజలు స్వాగతించటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ అనేక రాష్ర్టాల ముఖ్యమంత్రులు, నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారు. ఫలితంగా రాష్ట్రంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందంజలో ఉన్నది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ర్టాలూ అమలు చేస్తున్నాయి.
–మంత్రి పువ్వాడ అజయ్ కుమార్