Musi River | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘గాలి వానలో.. వాన నీటిలో పడవ ప్రయాణం..’ అన్నట్టు మారింది సియోల్‌కు వెళ్లిన మంత్రుల బృందం పర్యటన. ఏం చేస్తున్నామో.. ఏం చూస్తున్నామో.. ఎటు పోతున్నామో ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితి. ‘దెబ్బ మీద దెబ్బ’ అంటారు కదా. సరిగ్గా అలాగే.. దక్షిణ కొరియా రాజధాని సియోల్ పర్యటనలో ఏ ప్రాంతాన్ని సందర్శించినా బృందానికి షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. మొత్తంగా చెప్పాలంటే 20 మందితో కూడిన ఈ బృందం మూడు రోజుల సియోల్ పర్యటన అట్టర్‌ఫ్లాప్‌గా మిగిలింది. వెరసి మూసీ నెపంతో రూ. కోట్ల ప్రజాధనాన్ని మంత్రులు కొరియా నదుల్లో కలిపారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
పేదలను కొట్టి ఆ భూములను పెద్దలకు అప్పగించేందుకే ‘మూసీ ప్రాజెక్టు’ను రేవంత్ ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వం దక్షిణ కొరియా రాజధాని సియోల్ పర్యటనను ప్రకటించింది. 20 మందితో కూడిన మంత్రులు, విలేకరుల బృందం ఆదివారం హైదరాబాద్ నుంచి సియోల్‌కు మూడు రోజుల పర్యటన నిమిత్తం బయల్దేరింది. అయితే, ప్రభుత్వం తరఫున ఏదైనా విదేశీ పర్యటన చేపడితే, ఒక ఎజెండా, ఆ దేశ ప్రతినిధులతో చర్చించాల్సిన అంశాలు, పర్యటించాల్సిన ప్రాంతాలు ఇలా సమస్త వివరాలను, ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకుంటారు. దీనికి సంబంధించి ప్రకటనను కూడా విడుదల చేస్తారు. అయితే, సియోల్ పర్యటనలో అదేమీ కనిపించలేదు. చుంగ్ గై చున్ ప్రాజెక్టు మాత్రమే బృందం పర్యటించనున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దీంతో మూసీ నదికి, సియోల్‌లో ప్రవహిస్తున్న చుంగ్ గై చున్ వాగుకు అసలు పోలికే లేదని, ఆ ప్రాజెక్టు ప్లానింగ్, మూసీ ప్రాజెక్టుకు ఏ మాత్రం సరిపోలదని మంత్రుల పర్యటనకు ముందే ‘నమస్తే తెలంగాణ’ రుజువులతో సహా ప్రచురించింది. అయినప్పటికీ, మంత్రుల బృందం టూర్‌ను ప్రారంభించింది.
చుంగ్ వాగును చూశాక..
తొలిరోజు పర్యటనలో భాగంగా చుంగ్ గై చున్ వాగును చూసిన బృంద సభ్యులు ఒకింత షాక్‌కు గురైనట్టు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోలను బట్టి అర్థమైంది. చుంగ్ వాగును చూశాక.. ‘ఇది నది కాదు. పిల్ల వాగు’ అని బృందంలోని ఒకరు, ‘దీన్ని చూడటానికి ఇంత దూరం వచ్చామా?’ అని మరో సభ్యుడు గుసగుసలాడుకొన్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఈ వాగుకు సుందరీకరణ కూడా అవసరంలేదు. ఇది మూసీకి పనికి రాదు’ అని బృందంలోని మరో సభ్యుడు వాపోవడం గమనార్హం. దీంతో చుంగ్ వాగు పర్యటన ఫెయిలవ్వడంతో అక్కడి నుంచి బృందం.. సంగాయ్-డోంగ్లోని వ్యర్థాల దహన ప్లాంట్ ప్రాజెక్టును సందర్శించింది. రోజూ 1000 టన్నులు వచ్చే వ్యర్థాలను శుద్ధిచేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉన్నదని అబ్బురపడింది. అయితే, ఇంతకంటే గొప్ప ప్లాంట్ మన హైదరాబాద్‌లోనే ఉన్నదని, రోజుకు 1500 నుంచి 1600 టన్నుల చెత్తను శుద్ధిచేసి కరెంటు ఉత్పత్తి చేసే సామర్థ్యం దానికున్నదని బృందంలోని ఓ సభ్యుడు అనడంతో మిగతా వారంతా కంగుతిన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆ ప్లాంట్ ఏర్పాటు జరిగిందని తేలడంతో ఏంచేయాలో పాలుపోని మంత్రులు అక్కడి నుంచి వడివడిగా కదిలినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
షాక్ ఇచ్చిన హాన్ నది
చుంగ్ వాగు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న మంత్రుల బృందం.. మూసీ పేరిట వచ్చిన ఈ టూర్‌ను ఎలాగోలా సక్సెస్ చేయాలని సియోల్ శివారుల్లో ప్రవహిస్తున్న హాన్ నదిని పర్యటించాలని నిర్ణయించుకున్నది. దీంట్లో భాగంగా హాన్ నది పరిసరాల్లో పర్యటించింది. కానీ, ‘మూసీ పునరుజ్జీవ’ ప్రాజెక్టుకు, హాన్ ప్రాజెక్టుకు ఎక్కడా పొంతనలేకపోవడం బృంద సభ్యులు గమనించారు. ఎందుకంటే, హాన్ ఓ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు. నీటి శుద్ధీకరణకు ప్రాధాన్యంలేదు. పైగా నది ఒడ్డున ఎత్తైన భవంతులు, వాణిజ్య సముదాయాలే కనిపించాయి. పైగా హాన్ నదిలోనే ఐల్యాండ్స్ ఏర్పాటు చేయడం, ఒడ్డున రివర్‌ఫ్రంట్ పేరిట పార్కులను నిర్మించడాన్ని పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు బృందం గ్రహించింది. హాన్ నదిలో చేపట్టిన కృత్రిమ నిర్మాణాలు నదీప్రవాహానికి అడ్డంకులు కలిగించి పర్యావరణంపై ప్రభావం చూపుతున్నట్టు స్థానికులు మండిపడుతున్నట్టు తెలియడం కూడా బృందాన్ని ఒకింత షాక్‌కు గురిచేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో హాన్ నది నుంచి కూడా బృందం వెనక్కి వచ్చేసింది.
అందుకే డైవర్షన్ డ్రామా
మంత్రుల సియోల్ పర్యటన ఘోరంగా విఫలం అయ్యిందని అందరికీ అర్థం అయ్యింది. రూ. కోట్ల ప్రజాధనాన్ని ఇలాంటి పర్యటనల పేరిట ఖర్చు చేయడం ఏమిటని? రేవంత్ ప్రభుత్వాన్ని నెటిజన్లు నిలదీశారు. దీని నుంచి దృష్టి మళ్లించేందుకు దీపావళికి పొలిటికల్ బాంబులు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైవర్షన్ డ్రామా మొదలు పెట్టినట్టు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. పొలిటికల్ బాంబులేమో గానీ, సియోల్ బాంబు మాత్రం తుస్సుమన్నదని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. కాగా.. చుంగ్ గై చున్ నది కాదు వాగు అని తేలడం, హాన్ పునరుజ్జీవ ప్రాజెక్టు కాదని రుజువవ్వడంతో ఇక చేసేదేమీలేక ఈ నదుల నమూనాలను మూసీకి అన్వయించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరోక్షంగా పేర్కొనడం కొనమెరుపు.
వెళ్లింది ఎందుకంటే??
సియోల్‌లోని చుంగ్ గై చున్ వాగు, హాన్ నది పరిసరాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కూడిన బృందం పర్యటిస్తున్న సమయంలో అలాగే మూడు రోజుల కొరియా పర్యటనలో సభ్యుల మధ్య నీటి శుద్ధికి సంబంధించిన ఏ ఒక్క చర్చగానీ, మూసీ పక్షాళనకు సంబంధించి ఏ అంశంగానీ చర్చకు రాలేదు. చుంగ్ వాగు, హాన్ నది చుట్టుపక్కల నిర్మించిన భారీ భవనాలు, రియల్ ఎస్టేట్‌పై బృంద సభ్యుల మధ్య పెద్దఎత్తున చర్చ జరిగింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలను బట్టి ఈ విషయం స్పష్టమవుతున్నది. ‘సియోల్ నగరంలో ఉన్న విధంగానే మన హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి నది ప్రవహిస్తుంది. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఇంతకు ముందు ఇక్కడికి టూర్‌కు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మమ్మల్ని పంపించిండు. చుంగ్ గై చున్ పక్కనే రెస్టారెంట్లు, ఇవన్నీ (ఆకాశహర్మ్యాలు) వచ్చినయి. ఇవన్నీ పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) విధానంలో కట్టిన ప్రాజెక్టులు.
హైదరాబాద్‌లోని మూసీని కూడా ఇట్ల తయారు చేస్తే ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుంది’ అని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడం దీనికి నిదర్శనం. అంటే.. మూసీ ఇరువైపులా చుంగ్ గై చున్ వాగు పరిసరాల లెక్క మారుస్తారని సదరు ఎంపీ అధికారికంగానే చెప్పినట్టు అర్థమవుతున్నది. మూసీ వెంట ఇంత పెద్ద ఆకాశహర్మ్యాలు రావాలంటే బఫర్‌జోన్ దాటి కిలోమీటర్ మేర విస్తరణ చేస్తారని మరోసారి చెప్పకనే చెప్పారు. ఇప్పటివరకు రేవంత్ సర్కారు బయటికి బఫర్‌జోన్ వరకు ఉన్న 10 వేల నిర్మాణాలనే కూల్చుతామని చెప్తున్నా.. ప్రజాసంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో నదికి రెండు వైపులా కిలోమీటర్ మేర అభివృద్ధి చేస్తామని పొందుపర్చారు. తాజాగా సియోల్ పర్యటనలో మంత్రులు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో మూసీ పునరుజ్జీవం కోసం మంత్రుల బృందం సియోల్ పర్యటన చేపట్టినట్టు కనిపించట్లేదని, మూసీ పరీవాహకంలో రియల్‌ఎస్టేట్‌ను ప్రోత్సహించడానికి కావాల్సిన స్ఫూర్తి పొందడానికే ఈ టూర్‌ను చేసినట్టు కనిపిస్తున్నదని మంత్రులు, ఎంపీల వ్యాఖ్యలను ఉటంకిస్తూ తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
మరేం చేద్దాం??
ఏ లక్ష్యం పేరుచెప్పి సియోల్ పర్యటనకు వచ్చామో.. అది ఫెయిల్ కావడంతో ఢీలా పడిపోయిన మంత్రుల బృందం అప్పటికప్పుడు రూట్ మార్చినట్టు సమాచారం. ఏదో ఒక పర్యటన చేయాలనుకున్న బృందం.. సియోల్ స్పోర్ట్స్ వర్సిటీని సందర్శించింది. హైదరాబాద్ శివారుల్లో ఫోర్త్‌సిటీలో 70 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని సియోల్ వర్సిటీ ప్రతినిధులకు మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది. ఎంవోయూ కుదుర్చుకుందామని ఒత్తిడి చేసింది. అయితే, శిక్షణకు ఓకే గానీ, మిగతా విషయాలు తమ ప్రతినిధులతో చర్చించి చెప్తామని వర్సిటీవర్గాలు చెప్పడంతో బృందం మళ్లీ నీరసించిపోయినట్టు సమాచారం. సియోల్ పర్యటనలో స్పోర్ట్స్ వర్సిటీతో ఎంవోయూ కుదుర్చుకున్నామని గొప్పగా చూపెట్టాలనుకున్న మంత్రుల బృందానికి చివరకు నిరాశే మిగిలింది.
మూడు రోజుల సియోల్ పర్యటనలో ఏం జరిగిందంటే?
తొలి రోజు: చుంగ్ గై చున్ వాగు, వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించాలనుకున్న మంత్రుల బృందం
షాక్ నంబర్ 1:
చుంగ్ గై చున్ వాగును చూశాక..
‘ఓర్నీ..నది అనుకొనివచ్చాం. ఇదో పిల్లకాలువ. దీన్ని చూడటానికి ఇంత దూరం వచ్చామా? ఈ వాగు సుందరీకరణ మన మూసీకి అస్సలు సెట్ కాదు’
బృందంలోని సభ్యుల గుసగుసలు
షాక్ నంబర్ 2:
వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ల సందర్శన తర్వాత..
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వాటి సామర్థ్యం 1500 టన్నులు. అయితే, సియోల్‌లోని వ్యర్థాల ప్లాంట్ల సామర్థ్యం గరిష్ఠంగా 1000 టన్నులుగానే ఉన్నది. ఇది తెలిసి బృందంలోని సభ్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
రెండోరోజు: చుంగ్ గై చున్ ఫెయిల్
అవడంతో.. హాన్ నది సందర్శన
షాక్ నంబర్ 3:
చుంగ్ గై చున్ వాగు పర్యటన బెడిసికొట్టడంతో.. సియోల్ శివారుల్లోని హాన్నదిని పర్యటించాలని బృందం అప్పటికప్పుడు నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే హాన్ నది ప్రక్షాళనకు సంబంధించి ఏ వివరాలు బృందానికి లభించలేదు. ఎందుకంటే హాన్ రీజ్యువెనెషన్ ప్రాజెక్టు కాదు. అదో రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు. పైగా నదిలో ఐల్యాండ్ల ఏర్పాటుతో పర్యావరణవేత్తల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయని తెలుసుకున్న బృందం ఒకింత షాక్‌కి గురైంది.
మూడోరోజు: నదులతో ఐతలేదని..
స్పోర్ట్స్ వర్సిటీ సందర్శన
షాక్ నంబర్ 4:
మూసీ పునరుజ్జీవం నమూనా కోసం వెళ్తే.. ఆ పని జరుగకపోవడంతో మంత్రుల బృందం రూట్ మార్చింది. అప్పటికప్పుడు క్రీడావర్సిటీని ఇందులో భాగంగానే సియోల్ స్పోర్ట్స్ వర్సిటీని సందర్శించిన బృందం.. తెలంగాణ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఎంవోయూ కుదుర్చుకుందామని ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే, శిక్షణకు ఓకే గానీ, మిగతా విషయాలు తర్వాత అని వర్సిటీ ప్రతినిధులు చెప్పడంతో బృందం మళ్లీ నీరసించిపోయింది.
చివరగా బృందానికి నేతృత్వం వహించిన పొంగులేటి ఏమన్నారంటే??
సియోల్‌లోని చిన్న (చుంగ్ గై చున్ వాగు), పెద్ద (హాన్ నది) నదుల పునరుజ్జీవ నమూనాలను మూసీకి అన్వయిస్తామా? లేదా? అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. సియోల్ అభివృద్ధి మనకు పనికొస్తుందా? లేదా? అనే విషయంపై ఈ పర్యటన ద్వారా ఒక అవగాహనకు వచ్చాం.
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి