e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home Top Slides అది ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టే

అది ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టే

అది ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టే
  • ఆ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణ రైతుల నోట్లో మట్టే
  • ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ బీజేపీ ఎందుకు మాట్లాడదు?
  • తెలంగాణకు ఏం చేశాడని వైఎస్సార్‌ దేవుడవుతాడు?
  • తెలంగాణకు అన్నీ చేస్తున్న సీఎం కేసీఆరే అసలైన దేవుడు
  • సీమ ఎత్తిపోతలపై దుమ్ము దులిపిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 24 (నమస్తే తెలంగాణ): అడ్డగోలు నీటి తరలింపుతో తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టేందుకు ఏపీ సీఎం జగన్‌ కుట్ర లు చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టే అని.. పనులు వెంట నే నిలిపి వేయాలని స్వయంగా కృష్ణాబోర్డు ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. తనపై విరుచుకుపడిన ఏపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రయోజనాలకోసం ఏపీకి చెందిన బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే.. తెలంగాణలోని ఆ పార్టీ అధ్యక్షుడు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వైఎస్‌ ఏపీకి నీళ్లు మలుపుకుపోతుంటే హారతులు పట్టిన నాయకులు కూడా తమపై విమర్శలుచేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని ధ్వజమెత్తారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ రాజకీయ సమాజం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.

పనులు వెంటనే ఆపేయాలి

తెలంగాణకు వైఎస్‌ చేసిన అన్యాయాలపై ఈ ప్రాంత బిడ్డగా విమర్శించానని మంత్రి వేముల వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, సీఎం కేసీఆర్‌ ఎన్నో పనులు చేస్తున్నారని, ఆయనే తెలంగాణవారికి నిఖార్సైన దేవుడని వ్యాఖ్యానించారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌, కృష్ణా రివర్‌ బోర్డు ఆదేశాల మేరకు వెంటనే కుడికాల్వ విస్తరణ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేయాలని డిమాండ్‌చేశారు. ‘పోతిరెడ్డిపా డు, రాయలసీమ లిఫ్ట్‌లతో రోజూ 7.7 టీఎంసీల నీటి తరలింపునకు ఏపీ సీఎం కుట్ర పన్నా రు. ఇంత నీటిని ఏపీకి తరలిస్తే మన తెలంగాణ ప్రాజెక్టులకు, సాగర్‌ ఎడమ కాల్వకు నీళ్లురావు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని రైతుల నోట్లో మట్టికొట్టినట్టే. హైదరాబాద్‌కు మంచినీటి సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉన్నది’ అన్నారు.

అన్ని వేదికలపైనా ఎప్పటికప్పుడు ఫిర్యాదు

- Advertisement -

ఏపీ అక్రమ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి నెలలోనే అన్ని ఆధారాలతో కృష్ణా రివర్‌ బోర్డుకు లేఖరాశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. ‘గత ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం వివిధ ఫోరంలలో దీన్ని అడ్డుకుంటూనే ఉంది. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులు నిలిపివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణాబోర్డుకు లేఖలు రాశారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై ఈ ఏడాది ఫిబ్రవరి 24న గ్రీన్‌ ట్రిబ్యునల్‌ స్టే ఆర్డర్‌ ఇచ్చింది. దీన్ని అమలు చేయాలని, ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని పూర్తి ఆధారాలతో కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణాబోర్డుకు సీఎం కేసీఆర్‌, సీఎస్‌ ద్వారా లేఖలు రాయించారు. వాటి ఫలితంగానే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ఆపాలంటూ బుధవారం ఏపీ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అన్ని సక్రమంగా ఉంటే పనులు ఎందుకు ఆపాలని ఆదేశిస్తుంది’ అని ఆయన ప్రశ్నించారు.

విపక్ష నేతలెక్కడ?

ఏపీ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. వాస్తవానికి పోతిరెడ్డిపాటు మొదలైంది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే అని గుర్తుచేశారు. ‘ఒక టీఎంసీ పోయే కాల్వను 2005లో 4 టీఎంసీలకు విస్తరించారు. అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉండి ఏంచేశారు? అప్పటి కాంగ్రెస్‌ మంత్రి డీకే అరుణ హారతులు పట్టారు, అప్పటి ఇరిగేషన్‌ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొబ్బరికాయలు కొట్టారు’ అని విమర్శించారు. ‘ఈ అంశంపై మంత్రిగా నేను మాట్లాడిన వెంటనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు నాపై విరుచుకుపడ్డారు. ఆ ప్రాంత బిడ్డగా ఆయన అక్కడి ప్రజలపక్షాన మాట్లాడారు. కానీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు నోరు మెదపడం లేదు? మేం ఇన్ని లేఖలు రాస్తున్నా.. కేంద్రం ఎందుకు నోరు మూసుకుంది?. నీటి పంపకాల వాటాలపై కేంద్రం తలచుకుంటే వెంటనే తీర్పు చెప్పొచ్చు కానీ ఏండ్లుగా తాత్సారం ఎందుకు చేస్తున్నది’ అని వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

వైఎస్‌ తెలంగాణకు దేవుడెట్లయితడు?

‘తెలంగాణ బిడ్డగా ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం నేను వైఎస్‌పై నా భావాలు వ్యక్తం చేస్తే ఇక్కడి వారు ఎందుకు అంతలా స్పందిస్తున్నారు?’ అని మేముల ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బద్ధవ్యతిరేకి అన్ని విషయం ఈ ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. 2004లో వైఎస్‌ సీఎం కావడానికి సహకరించింది టీఆర్‌ఎస్‌ అని, తెలంగాణ ఇస్తేనే కాంగ్రెస్‌తో కలిసి కొట్లాడుతామని ఉద్యమ నేత కేసీఆర్‌ పొత్తుకు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించిన వైఎస్‌ తెలంగాణ ప్రజలకు దేవుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ తెలంగాణ పాలిట రాక్షసుడని ఆరోపించారు. వైఎస్‌ గొర్లు తినేటోడైతే జగన్‌ బర్లు తినేటోడుగా మారారని విమర్శించారు. కేసీఆర్‌ సింహం లాంటోడని ఆయనతో ఆటలాడుకోవడం జగన్‌కు మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల మధ్య చిచ్చు పెడుతున్నదని ఆరోపించారు.

సోయి మాకే ఉన్నది.. అందుకే ఎప్పటికప్పుడు లేఖలు: వేముల

  • ఏపీ ప్రభుత్వం 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం, పోతిరెడ్డిపాడు కాల్వ విస్తరణ పనులకు జీవో ఇచ్చింది.
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మే 12, 2020న తెలంగాణ ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణా రివర్‌బోర్డుకు అభ్యంతరాలు తెలియజేస్తూ లేఖ రాశారు.
  • 25-07-2020న రాయలసీమ ఎత్తిపోతల పనులు ప్రారంభించారని పేర్కొంటూ ఈఎన్సీ మరోమారు లేఖ రాశారు.
  • 26-02-2021న ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ పనులు ఆపాలని నాలుగు ఉత్తరాలు, ఎన్జీటీలో స్టేను కూడా ఏపీ బేఖాతర్‌ చేస్తున్నదని చెబుతూ మూడు లేఖలు రాశాం.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అది ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టే
అది ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టే
అది ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టే

ట్రెండింగ్‌

Advertisement