మెదక్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన సేవలు అపారమని తెలిపారు. ప్రపంచ దేశాల నుండి ఉత్తమ అంశాలను స్వీకరించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం ఆయన గొప్పదనమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందరికీ చేరేలా చేసిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, రచనలు ప్రతి తరానికి మార్గదర్శకమని అన్నారు.
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమాన హక్కులు లభించాయని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనేలా అంబేద్కర్ కృషి చేశారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, డీఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎఫ్ఓ జో.జి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు