శివంపేట, ఏప్రిల్ 14 : మెదక్ జిల్లా శివంపేట మండలంలోని దొంతి గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. శ్రీ వెంకటరమణ భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేయడానికి గ్రామానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలోని పలువురు లబ్ధిదారులు గ్యాస్ కోసం ముందుగా బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ బుకింగ్ నమోదు కాకపోవడంతో సిలిండర్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ఇదే సమయంలో సిలిండర్లతో గ్రామానికి వచ్చిన భారత్ గ్యాస్ వాహనాన్ని కొందరు గ్రామస్తులు ఒక్కసారిగా చుట్టుముట్టారు.
ఈ సందర్భంగా కొంతమంది సిలిండర్లను వాహనం నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమికంగా మూడు గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లినట్లు గుర్తించగా, వాటిలో రెండు సిలిండర్లను పోలీసులు తిరిగి రికవరీ చేసినట్లు తెలిపారు. మరో సిలిండర్ ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. గ్యాస్ బుకింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించి గ్రామస్తులకు గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.