హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ‘సొమ్మోకరిది.. సోకు మరొకరిది!’ ఈ సామెత ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుకు సరిగ్గా సరిపోతుందేమో! బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలతో ధాన్యం ఉత్పత్తి పెరుగగా ఆ ధాన్యాన్ని ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేస్తూ ప్రభుత్వం సొమ్ము చేసుకుంటున్నది. పైగా ఇదేదో తమ ఘనకార్యం అన్నట్టుగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిలిప్పీన్స్కు లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తామని ఒప్పుకొన్న పౌరసరఫరాల శాఖ, ఇందులో భాగంగా సోమవారం 12,500 టన్నుల బియ్యం ఎగుమతిని కాకినాడ పోర్టు నుంచి ప్రారంభించింది. దీన్ని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం నుంచే ఎగుమతి చేయడం గమనార్హం.
2022-23లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగిలో 60 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో కాంగ్రెస్ సర్కారు 38 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేసింది. ఈ వేలంలోని ధాన్యాన్ని బిడ్డర్లు ఎత్తకపోవడంతో ఇదే ధాన్యాన్ని ఇప్పుడు బియ్యంగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నది. బిడ్డర్ల నుంచి ధాన్యం ఎత్తించడంలో, డబ్బులు వసూలు చేయడంలో విఫలమైన పౌరసరఫరాల సంస్థ ఇప్పుడు అదే బియ్యాన్ని ఎగుమతి చేసి ఏదో గొప్ప పని చేసినట్టుగా చెప్పుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాడు ఎఫ్సీఐకి ఇవ్వకుండా అధిక మొత్తంలో ధాన్యాన్ని వేలం వేసి, అదీ సక్సెస్ చేయకుండా ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల పౌరసరఫరాల సంస్థకు నష్టమే తప్ప లాభం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూక శాతం 5కు తగ్గించడం కోసం మిల్లర్లకు టన్నుకు రూ.3 వేల ప్రోత్సాహం, మిల్లుల నుంచి పోర్టు వరకు రవాణా చార్జీల భారం ఇలా అన్నీ పౌర సరఫరాల సంస్థపైనే పడుతున్నాయి. ఫిలిప్పీన్స్కు టన్నుకు రూ.36 వేలకు విక్రయించింది. ఎఫ్సీఐ ఇచ్చే ధరకే ఫిలిప్పీన్స్కు ఇస్తున్నారు. దీంతో నూకశాతం తగ్గింపు భారం, రవాణా భారం పౌరసరఫరాల సంస్థపైనే పడుతున్నది. దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.