TS Minister Satyavati Rathod | రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఏనాడు మాట్లాడని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేస్తున్న అర్థరహితమైన విమర్శలను రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలతో టైంపాస్ చేస్తున్నాడే తప్ప, గత తొమ్మిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి, ముఖ్యంగా గిరిజనులు, మహిళల కోసం ఏం చేసిందో ఒక్కసారైనా చెప్పడం లేదన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదన్నారు. పార్లమెంట్లో సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎందుకు తేలేదో, అడ్డుకున్నది ఎవరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల జీవితాలను కాంగ్రెస్ పార్టీ చీకట్లోకి నెట్టివేసిందని సత్యవతి రాథోడ్ ఆరోపించారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రప్రదేశ్ లో కలపడం దగ్గరి నుంచి, ప్రత్యేక తెలంగాణ కోసం 1200 మంది పౌరుల బలిదానాల దాకా.. తెలంగాణ ప్రజలు అనుభవించిన ప్రతి కష్టానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అన్న సంగతి రేవంత్ రెడ్డి గ్రహించాలన్నారు. అటువంటి అలాంటి కాంగ్రెస్ పార్టీకి, ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్పై, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు.
మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, తెలంగాణ ఆడబిడ్డగా ఎమ్మెల్సీ కవిత రోజంతా నిరసన తెలియజేస్తే, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మద్దతు తెలుపలేదని సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఏ ఒక్క రోజు కూడా మహిళా రిజర్వేషన్లపై బీజేపీని కాంగ్రెస్ పార్టీ నిలదీయలేదని చెప్పారు. దీన్నిబట్టే మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఆసక్తి, చిత్తశుద్ది లేదని అర్థమవుతున్నదని అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎంత మొసలి కన్నీరు కార్చినా తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను నమ్మరని స్పష్టం చేశారు. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని తేల్చి చెప్పారు.