మహబూబ్‌నగర్, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎల్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అన్వేషణ కొనసాగుతున్నదని, ఆదివారం సాయంత్రంలోగా సహాయ చర్యలు పూర్తయ్యే అవకాశం ఉన్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం దోమలపెంట వద్ద మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి ఎస్ఎల్బీసీ టెన్నెల్లో జరుగుతున్న సహాయ చర్యల గురించి సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. మొత్తం 8 మంది గల్లంతు కాగా, జీపీఆర్ ద్వారా ఇప్పటికే నలుగురి జాడ కనుగొన్నారని, ఆ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. టన్నెల్ బోరింగ్ మిషన్ కింద మరో నలుగురి ఆనవాళ్లు కన్పించినట్టు తెలుస్తున్నదని చెప్పారు. సొరంగంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని, నిర్లక్ష్యం ఏమీ లేదని పేర్కొన్నారు.