కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారంతో ప్రజలను మాయ చేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి అధికారం అందిస్తే తెలంగాణను అంధకారంగా మారుస్తారని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ రెండు పార్టీల నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజల ముందుకు వస్తారని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో 247 మంది లబ్ధిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మానేరు నదిపై చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు కరీంనగర్ జిల్లా ఎలా ఉండేదో.. ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో ఎలా ఉందో ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు.
కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, గడిచిన ఎనిమిదేండ్లలో నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారని, ఆ నిధులతో నగరంలో అన్ని రోడ్లు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకొని సుందరంగా తీర్చిదిద్దామని మంత్రి గంగుల చెప్పారు. నగరానికి వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లోనూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో రాత్రిళ్లు కూడా రహదారులు జిగేల్మంటున్నాయని అన్నారు.
భావితరాలకు గొప్ప నగరాన్ని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని గంగుల చెప్పారు. కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలు పూర్తయితే కరీంనగర్ దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్కు అండగా నిలిచి సీఎం కేసీఆర్‌ను మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జెడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ, నగరపాలక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.